Priyanka Gandhi tests positive for Covid-19: కాంగ్రెస్ కీలక నేత, జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రా మరోసారి కోవిడ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ప్రియాంకా గాంధీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అంతకు ముందు ఈ ఏడాది జూన్ లో ప్రియాంకా గాంధీ కోవిడ్ బారినపడి కోలుకున్నారు. తరువాత నెల వ్యవధిలోనే మరోసారి కోవిడ్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్ లో ఉన్నారు.
మరోవైపు వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఈ రోజు రాజస్థాన్ అల్వార్ లో జరగాల్సిన నేత్రత్వ సంకల్ప్ శిబిర్ కార్యక్రమానికి హాజరు కావడం లేదు. ఇదే కార్యక్రమానికి ప్రియాంకగాంధీ వెళ్లాల్సి ఉన్నా.. కోవిడ్ కారణంగా ఆమె కూడా హాజరుకాలేకపోతున్నారు. వరసగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోవిడ్ బారిన పడుతూనే ఉన్నారు. గత జూన్ నెలలో సోనియాగాంధీ కోవిడ్ బారిన పడి ఢిల్లీలోని సర్ గంగారామ్ హస్పిటల్ లో చికిత్స పొందారు.
Read Also: KCR to go Bihar: బీహార్ వెళ్లనున్న కేసీఆర్. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో త్వరలో ప్రయాణం.
వీరితో పాటు కాంగ్రెస్ నేతలు పవన్ ఖేరా, పార్టీ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ కూడా కోవిడ్ బారిన పడినవారిలో ఉన్నారు. ఈ మంగళవారం కాంగ్రెస్ సీనియర్ నేత , రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే కూడా తనకు కోవిడ్ సోకినట్లు తెలిపాడు. ఇటీవల నాకు సన్నిహితంగా ఉన్నవారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఖర్గే సూచించారు.
ఇటీవల నేషనల్ హెరాల్ద్ కేసులో ఈడీ సోనియాగాంధీని విచారించిన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఆందోళనలు, నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే కోవిడ్ సోకినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులకు కరోనా సోకుతుండటంతో మరికొందరి నేతల్లో ఆందోళన నెలకొంది.