Tomato price: టమాటా రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే కిలో టామాటా ధర సెంచరీని దాటింది. ఇప్పుడు సరికొత్త రికార్డును సృష్టించింది. ఏకంగా కిలో టమాటా రూ. 155కు చేరుకుంది. అన్ని మెట్రో నగరాల్లో కిలో టమాటా రూ.58 నుంచి 148 వరకు అమ్ముడవుతున్నాయి. పశ్చిమ బెంగాల్ లోని పురూలియా ప్రాంతంలో కిలో టమాటా రూ. 155 ధర పలికింది. దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ.. కోల్‌కతాలో అత్యధికంగా టొమాటోలు కిలోకు 148 రూపాయలకు అమ్ముడయ్యాయి.
Read Also: UCC: యూసీసీపై బీజేపీ మిత్రపక్షాల అనైక్యత.. వ్యతిరేకిస్తున్న ఈశాన్య రాష్ట్రాల పార్టీలు
ముంబైలో అత్యల్పంగా కిలోకి రూ.58 ధర ఉంటే.. ఢిల్లీలో కిలోకి రూ.110, చెన్నైలో కిలోకి రూ. 117గా టమాటా ధర ఉంది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. సగటున ఆల్ ఇండియా రిటైల్ ధర రూ. 83.29గా ఉంది. ఢిల్లీలో నాణ్యత, స్థానికతను బట్టి కిలో టమాటాలకి రూ. 120-140 మధ్యలో ధర పలుకుతోంది. బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి ఆన్‌లైన్ కిరాణా షాపింగ్ అప్లికేషన్‌లలో టొమాటో ధర కిలో రూ.140కి పైగా ఉంది.
విపరీతమైన వేడి, రుతుపవనాల రాక ఆలస్యమైన కారణంగా టమాటా పంట దెబ్బతింది. దీంతో డిమాండ్ కి సరఫరా లేకపోవడంతో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. టమాటాను ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల నుంచి సరఫరా తగ్గిపోయింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలు కూడా పంటను దెబ్బతీస్తున్నాయి. యూపీ, హర్యానా వంటి పొరుగు రాష్ట్రాల్లో ఉత్పత్తి తగ్గడంతో ఢిల్లీలో టమాటా రేట్లు చుక్కల్ని అంటుతున్నాయి. మరో 15 రోజుల్లో తగ్గుముఖం పట్టి నెల రోజుల్లో సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం పేర్కొంది.