UCC: 2024 సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంలో భారతీయ జనతా పార్టీ తీసుకురానున్న ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ)పై ఎన్‌డీఏలోని మిత్రపక్షాల నుంచే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈశాన్య రాష్ట్రాల్లోని ఎన్‌డీఏ భాగస్వామ్య పార్టీలు యూసీసీని వ్యతిరేకిస్తున్నాయి. యూసీసీపై బీజేపీ పునరాలోచించుకోవాలని కోరుతున్నాయి. మిజోరాం అసెంబ్లీలో ఏకంగా యూసీసీని వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు. ఈ నేపథ్యంలో యూసీసీపై బీజేపీ ఎలా వ్యవహారించనుందో చూడాల్సి ఉంది..
Read also: Ban Phones In Classroom: క్లాస్ రూముల్లో మొబైల్స్ నిషేధం.. యూరోపియన్ దేశం కీలక నిర్ణయం
లోక్‌సభ ఎన్నికలకు మరో ఏడాది కూడా గడువు లేని నేపథ్యంలో యూసీసీపై దూకుడుగా ముందుకు వెళ్లాలని అనుకొంటున్న బీజేపీకి.. తమ ఎన్డీయే కూటమిలోని ఈశాన్య రాష్ర్టాలకు చెందిన మిత్రపక్ష పార్టీలే బ్రేకులు వేస్తున్నాయి. ఆయా రాష్ర్టాల్లోని పలు బీజేపీ మిత్ర పార్టీలు యూసీసీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దేశానికి భిన్నత్వమే బలమని, యూసీసీ విషయంలో కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని పలు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. తీవ్ర ప్రజావ్యతిరేకత నేపథ్యంలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గట్టెక్కేందుకు బీజేపీ ఈ సారి యూసీసీని ఆయుధంగా చేసుకోవాలనే యోచనలో ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో భాగంగానే ప్రధాని మోదీ ఇటీవల మధ్యప్రదేశ్ పర్యటన సందర్భంగా యూసీసీ తుట్టెను కదిపారని చెబుతున్నారు.
Read also: Ajit Agarkar BCCI Chairman: టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్.. కుర్రాళ్లపై ఫోకస్!
మేఘాలయలో నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్‌పీపీ)తో బీజేపీ కూటమిగా ఉన్నది. ఎన్‌పీపీ అధ్యక్షుడు, రాష్ట్ర సీఎం కాన్రాడ్ సంగ్మా ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ భారత వాస్తవ ఆలోచనలకు యూసీసీ వ్యతిరేకమని అన్నారు. భారత్ ఒక విభిన్న దేశమని, భిన్నత్వమే మన బలమని అభిప్రాయపడ్డారు. ఈశాన్య ప్రాంతంలో ప్రత్యేకమైన సంస్కృతి ఉన్నదని.. అది అలాగే కొనసాగాలని కోరుకుంటున్నామని చెప్పారు. నాగాలాండ్‌లో మిత్రపక్షమైన నేషనల్ డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ(ఎన్‌డీపీపీ) నుంచి బీజేపీ వ్యతిరేకత ఎదుర్కొంటున్నది. రాష్ట్ర ప్రజల హక్కులు, ఆచారాలు, సంస్కృతులను పరిరక్షించడమే ఒక రాజకీయ పార్టీగా తమ సిద్ధాంతమని, యూసీసీ అమలును వ్యతిరేకిస్తున్నట్టు గత నెలాఖరులో విడుదల చేసిన ఓ ప్రకటనలో ఎన్‌డీపీపీ స్పష్టం చేసింది. యూసీసీ విషయంలో కేంద్రం పునరాలోచన చేయాలని కోరింది. యూసీసీ అస్థిరతకు దారితీస్తుందని, శాంతియుత వాతావరణానికి ముప్పు ఏర్పడుతుందని హెచ్చరించింది. మిజోరాంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి పార్టీ మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్‌ఎఫ్), యూసీసీ అమలు ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ ఈ ఏడాది మొదట్లో అసెంబ్లీలో ఏకంగా ఏకగ్రీవ తీర్మానం చేసింది. యూసీసీ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుందని, ఇది మిజోలతో సహా మైనారిటీల మతపరమైన లేదా సాంఘిక పద్ధతులు, ఆచారాలు, సంస్కృతులు, సంప్రదాయాలను రద్దు చేసే ప్రయత్నమని తీర్మానం పేర్కొన్నది. అస్సాంలో యూసీసీ అమలుకు సీఎం హిమంత బిశ్వ శర్మ ఉబలాటపడుతున్నారు. అయితే రాష్ట్రంలో ఎన్‌ఆర్‌సీ నిర్వహణ తీరు, పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకించిన బీజేపీ మిత్రపక్షం అస్సాం గణపరిషత్(ఏజీపీ).. యూసీసీ విషయంలో తన స్టాండ్‌ను ఇంకా స్పష్టం చేయలేదు. పౌరసత్వ సవరణ బిల్లు నేపథ్యంలో ఏజీపీ గతంలో బీజేపీతో తెగదెంపులు చేసుకొని.. తర్వాత 2019 లోక్‌సభ ఎన్నిలకు ముందు జట్టు కట్టిన విషయం తెలిసిందే.
Read also: Russia: మాస్కోపై డ్రోన్ అటాక్.. అమెరికా, నాటో పనే అని రష్యా ఆరోపణలు..
ఉమ్మడి పౌరస్మృతి ద్వారా ప్రత్యేకమైన ఆచారాలు పాటించే గిరిజనుల ఉనికికి ముప్పు ఏర్పడుతుందని ఛత్తీస్‌గఢ్ సర్వ ఆదివాసీ సమాజ్(సీఎస్‌ఏఎస్) ఆందోళన వ్యక్తం చేసింది. యూసీసీ అమలు విషయంలో కేంద్రానికి అంత తొందపాటు వద్దని, అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సీఎస్‌ఏఎస్ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి అర్వింద్ నేతమ్ కోరారు. గిరిజన సమాజంలో యూసీసీని అమలు చేయడం అసాధ్యమని అభిప్రాయపడ్డారు. యూసీసీకి ఆప్ అనుకూలత వ్యక్తం చేయగా.. ఆ పార్టీ పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ మాత్రం భిన్నంగా స్పందించారు. రాజ్యాంగంలో యూసీసీ ప్రస్తావన ఉన్నదన్న బీజేపీ వాదనను ప్రశ్నిస్తూ.. సమాజంలోని పౌరులందరూ సమానమైతే, సాధారణ సివిల్ చట్టాలను కూడా అమలు చేయాలని రాజ్యాంగం కోరుతున్నదని పేర్కొన్నారు. అందరూ సామాజికంగా సమానంగా లేరని… ఇంకా చాలా మంది అణచివేతకు గురవుతున్నారని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తే.. అప్పుడు మత అంశాలను లేవనెత్తడం బీజేపీ ఎజెండా అని మండిపడ్డారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో యూసీసీ పేరుతో బీజేపీ నేతలు మరోసారి మత రాజకీయాలకు తెరలేపారని సమాజ్‌వాదీ పార్టీ నేత శివపాల్ యాదవ్ మంగళవారం లక్నోలో విమర్శించారు.