Rameshwaram Cafe Blast: బెంగళూర్ నగరంలోని రామేశ్వరం కేఫ్ పేలుడు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన బాంబు పేలుడులో 10 మంది గాయపడ్డారు. పథకం ప్రకారమే నిందితుడు ఐఈడీ బాంబుకు టైమర్‌ని అమర్చి పేల్చినట్లు తెలుస్తోంది. 2022 మంగళూర్‌లో జరిగిన ప్రెషర్ కుక్కర్ పేలుడుకు, తాజాగా జరిగిన బెంగళూర్ పేలుడుకు మధ్య సంబంధం ఉందని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ శనివారం అన్నారు. బెంగళూర్ లోని ఐటీ కారిడార్‌లోని బ్రూక్‌ఫీల్డ్ ప్రాంతంలో ఈ పేలుడు జరిగింది. దీనిని విచారించేందుకు పోలీసులకు స్వేచ్ఛ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.
మంగళూర్ సంఘటన, తాజా సంఘటనకు మధ్య లింక్ ఉన్నట్లు కనిపిస్తోందని, పోలీసుల ప్రకారం.. ఈ పేలుడులో ఉపయోగించిన పదార్థాల్లో సారూప్యత కనిపిస్తోందని శివకుమార్ అన్నారు. మంగళూర్, శివమొగ్గ నుంచి కూడా పోలీస్ అధికారులు వచ్చారని, అన్ని కోణాల్లో ఘటనను పరిశీలిస్తు్న్నారని చెప్పారు. బెంగళూర్ ప్రజలు ఆందోళన చెందొద్దని, ఇది తక్కువ తీవ్రత కలిగిన పేలుడని, ఇది స్థానికంగా తయారు చేయబడిందని చెప్పారు.
Read Also: Alahabad High Court : వివాహిత ముస్లిం మహిళ సహజీవనం చేయడం నిషేధం.. పిటిషన్ కొట్టేసిన కోర్టు
మంగళూరులో, నవంబర్, 2022లో ఆటో రిక్షాలో తీసుకెళ్తుండగా, ప్రెషర్ కుక్కర్‌లో ఉంచిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED) ప్రమాదవశాత్తు ఆగిపోయింది. పేలుడుపై విచారణలో ఈ బాంబును కద్రి మంజునాథ ఆలయం వద్ద అమర్చేందుకు సిద్ధం చేసినట్లు తేలింది. మంగళూర్ కుక్కర్ పేలుడులో లష్కరే తోయిబా ఉగ్రవాది ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.
బెంగళూర్ కేఫ్ పేలుడును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని.. అనుమానితుడు బస్సులో వచ్చాడని, అతను ఎలా తిరిగి వెళ్లాడనే అన్ని వివరాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డైందని శివకుమార్ చెప్పారు. బెంగళూర్ నగరంలో ప్రతీ చోట కెమెరాలు ఉన్నాయని చెప్పారు. పేలుడు ఘటనపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందని, ఎవరినీ విడిచిపెట్టే ప్రశ్నే లేదని, ఇది రాష్ట్ర గౌరవానికి సంబంధించిన అంశమని అన్నారు. బీజేపీ వాళ్లు ఏది కావాలంటే అది చెప్పనివ్వండీ, ఏదైనా చేయనివ్వండి, మేము వాటి గురించి కనీసం బాధపడమని, వాళ్లు నిర్మాణాత్మక సహకారాన్ని అందిస్తే సరే, రాజకీయాలు చేయాలనుకుంటే చేయనివ్వండి అంటూ డీకే శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.