Mohan Bhagwat: బీజేపీ సైద్ధాంతిక సంస్థ ఆర్ఎస్ఎస్ చీఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారాయి. ఇటీవల ఓ కార్యక్రమంలో మోహన్ భగవత్ మాట్లాడుతూ, 75 ఏళ్ల వయసు తర్వాత రిటైర్ కావాలని అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యల్ని ఉపయోగించుకుని కాంగ్రెస్, శివసేన(యూబీటీ) వంటి పార్టీలు బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ వ్యాఖ్యలు ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతకర్త మోరోపంత్ పింగలే తన 75వ పుట్టినరోజున చేసిన ప్రసంగాన్ని ప్రస్తావించాయి. అయితే, ఈ వ్యాఖ్యల కేవలం మోరోపంత్ పింగలేను మాత్రమే సూచిస్తున్నాయని, వాటితో మరెవరితో ముడిపెట్టకూడదని ఆర్ఎస్ఎస్ స్పష్టం చేసింది. ప్రతిపక్షాల విమర్శలకు బీజేపీ ఇంకా స్పందించలేదు.
Read Also: Indiramma Canteen : ఇందిరమ్మ క్యాంటీన్లలో అల్పాహారం.. మెనూ అదిరిందిగా
రెండు రోజుల క్రితం ఇంగ్లీషులో ‘మోరోపంత్ పింగలే: ది ఆర్కిటెక్ట్ ఆఫ్ హిందూ రిసర్జెన్స్’ అనే పుస్తకాన్ని అధికారికంగా ఆవిష్కరించే కార్యక్రమం జరిగింది. పింగలే తన 75 ఏళ్లు నిండిన తర్వాత చేసిన ప్రకటనను మోహన్ భగవత్ ప్రస్తావించారు. ‘‘75 సంవత్సరాల శాలువా మీపై కప్పబడి ఉంటే, మీరు ఒక నిర్దిష్ట వయస్సుకు చేరుకున్నారని, పక్కకు తప్పుకుని ఇతరులను పని చేయనివ్వాలని పింగలే ఒకసారి అన్నారు’’ అని మోహన్ భగవత్ నాగ్‌పూర్‌లో అన్నారు. ఇది యువతరం రావడానికి ఒక సంకేతమని ఆయన చెప్పారు.
ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు బీజేపీని ఇరకాటంలో పెడుతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తున్నాయి. సెప్టెంబర్ 17, 2025న ప్రధానిమోడీకి 75 ఏళ్లు నిండుతాయి. ఈ నేపథ్యంలో శివసేన ఠాక్రే వర్గం ఎంపీ ప్రియాంకా చతుర్వేది మాట్లాడుతూ.. ఇది స్పష్టమైన సందేశం అని, ఆర్ఎస్ఎస్ బీజేపీ మధ్య ఏం జరుగుతుందో దీని ద్వారా అర్థమవుతుందని అన్నారు. కాంగ్రెస్ నేత జై రాం రమేష్ మాట్లాడుతూ.. ‘‘ఒకే బాణం రెండు లక్ష్యాలు’’ ప్రధాని మోడీతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్‌కు కూడా ఈ ఏడాదితో 75 ఏళ్లు నిండుతున్నాయని గుర్తు చేశారు.