PM Narendra Modi Comments in NITI Aayog Meeting: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆదివారం ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. దేశంలోని 23 మంది ముఖ్యమంత్రులు, ముగ్గురు లెఫ్టినెంట్ గవర్నర్లు, ఇద్దరు అడ్మినిస్ట్రేటర్లు, కేంద్ర మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2020 మార్చి కరోనా లాక్ డౌన్ తర్వత తొలిసారిగా ముఖాముఖీ సమావేశం జరిగింది. అంతకు ముందు కేవలం వర్చువల్ సమావేశాలే జరిగాయి. ఈ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ కట్టడిలో దేశంలోని రాష్ట్రాలు కీలక పాత్ర పోషించాయని అన్నారు. కోవిడ్ కట్టడి ద్వారా ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారత దేశం ఓ నాయకుడిగా ఎదగడానికి దారి తీసిందని అన్నారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో తొలిసారి దేశంలోని ప్రధాన కార్యదర్శులంతా ఒకే చోట సమావేశం అయ్యారని.. మూడు రోజుల పాటు జాతీయ ప్రాధాన్యత అంశాలపై చర్చించారని వ్యాఖ్యానించారు.
నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యంగా వ్యవసాయంలో వైవిధ్యం తీసుకురావాలని.. పప్పు ధాన్యాలు, నూనెగింజలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని చర్చించారు. జాతీయ విద్యావిధానాన్ని ఉన్నత, పాఠశాల విద్యల్లో ప్రవేశపెట్టాలని సూచించారు. జీఎస్టీ వసూళ్లు మెరుగయ్యాయని.. జీఎస్టీ వసూళ్లు పెరిగేలా కేంద్ర, రాష్ట్రాలు సమిష్టిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని.. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా దేశం మారడానికి ఇది కీలకమని అన్నారు. కరోనా వ్యాప్తి సందర్భంలో భారత దేశ సమాఖ్య వ్యవస్థ ప్రపంచానికి ఓ నమూనాగా ఉందని అన్నారు.
Read Also: Rashmika Mandanna: రెమ్యునరేషన్ అమాంతం పెంచిన రశ్మికా.. ఎంతంటే?
ప్రధాని మోదీ నీతి ఆయోగ్ సమావేశంలో 2023 భారత్ నిర్వహించే జీ-20 సమావేశంపై కూడా చర్చించారు. ఇది ఢిల్లీకే పరిమితం కాదని.. దేశంలో ప్రతీ రాష్ట్రాన్ని, కేంద్ర పాలిత ప్రాంతాన్ని ప్రపంచానికి చూపడానికి ప్రత్యేక అవకాశమని ఆయన అన్నారు. జీ 20 సమావేశాలు భారత్ కు ఓ గొప్ప అవకాశం అని.. ఏడాది పొడవునా ఢిల్లీలోనే కాకుండా.. ప్రతీ రాష్ట్రంలో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సమావేశాలు జరుగుతాయని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ . జైశంకర్ అన్నారు.