Ayodhya Ram Temple: అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం నవంబర్ 25తో ముగియనుంది. ఈ సందర్భంగా అయోధ్య ప్రధాన ఆలయంపై జెండాను ఎగురవేయడానికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాని నరేంద్రమోడీని అధికారికంగా ఆహ్వానించింది. ఈ వేడుకలు రామాలయం నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు చెబుతాయి. ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా మాట్లాడుతూ, ప్రధానమంత్రి “సూత్రప్రాయంగా తేదీని అంగీకరించారు” అని, ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొనడానికి ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నాయని అన్నారు.
భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు, రామ భక్తుల కోసం ఈ ఆలయం పూర్తి స్థాయిలో సంసిద్ధతతో ఉందనే విషయాన్ని సూచించడానికి, హిందూ సంప్రదాయంలో పవిత్ర చిహ్నమైన ఆలయ జెండాను ప్రధాని మోడీ ఎగురవేయనున్నారు. 2022లో గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తికావడంతో ప్రారంభమైన దశల వారీ నిర్మాణ పనులకు ఈ వేడుకులు ముగింపుగా నిలుస్తాయి.
పెద్ద కాంప్లెక్స్ లోపల 14 చిన్న దేవాలయాలు ఉన్నాయని, అవన్నీ పూర్తయ్యాయని, త్వరలో ప్రజలకు తెరవబడతాయని మిశ్రా ధృవీకరించారు. పార్కోటా (బయటి సరిహద్దు), పరిక్రమ సముదాయం కూడా పూర్తయ్యాయని ఆయన చెప్పారు. ఆలయం పూజల కోసం తెరిచినప్పటి నుంచి ఏడు కోట్ల మంది భక్తులు శ్రీరాముల వారిని దర్శించుకున్నట్లు వెల్లడించారు. నవంబర్ 25న జరిగే వేడుక జాతీయ ఐక్యత, భక్తి విశ్వాసాలకు, భారతదేశ చరిత్రలో చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఓ అధ్యాయానికి ముగింపు పలకనుంది.