Waqf Bill: చారిత్రాత్మక వక్ఫ్ బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. పార్లమెంటరీ, మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బిల్లును సభ ముందుంచారు. రిజిజు ప్రసంగం ప్రారంభించిన వెంటనే ప్రతిపక్షాలు అడ్డుకోవడానికి ప్రయత్నించాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌పై కేంద్రమంత్రి నిప్పులు చెరిగారు. 2014లో బీజేపీ అధికారంలోకి రాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్, విమానాశ్రయ భూములను వక్ఫ్ ఇచ్చేదని అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంట్‌ని వక్ఫ్ స్వాధీనం చేసుకోవడాన్ని ఆపేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చట్టానికి చేసిన మార్పులు ఇతర చట్టాల కన్నా అధిక ప్రభావం చూపించినందున వక్ఫ్ బిల్లుకు కొత్త సవరణలు అవసరమని రిజిజు అన్నారు.
Read Also: Waqf Bill: వక్ఫ్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్రం..
ఈ బిల్లు వల్ల ముస్లింలకు వచ్చే నష్టమేమీ లేదని, ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న వారు తెలుసుకోవాలని కేంద్రమంత్రి సూచించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలో ఉంటే ఢిల్లీలోని కీలక స్థలాలు వక్ఫ్ సొంతమయ్యేవని అన్నారు. 123 ఆస్తుల్ని కాంగ్రెస్ వక్ఫ్ బోర్డుకు కట్టబెట్టిందని చెప్పారు. వక్ఫ్ చట్టంలోని లోపాలు అనేక ఉల్లంఘనలకు కారణమైందని అన్నారు. ఈ బిల్లు పేద ముస్లింలు, పిల్లలు, మహిళలకు ప్రయోజనాలు చేకూరుస్తుందని, వక్ఫ్ బోర్డు కింద ఆస్తుల నిర్వహణలో జవాబుదారీతనం, పారదర్శకతను నిర్ధారిస్తుందని కిరణ్ రిజిజు వెల్లడించారు.
1970 నుండి ఢిల్లీలో పార్లమెంట్ భవనంతో సహా అనేక ఆస్తులకు సంబంధించిన కేసులు నడుస్తున్నాయని, ఢిల్లీ వక్ఫ్ బోర్డు వీటిని క్లెయిమ్ చేసింది, ఈ కేసు కోర్టులో ఉంది, అప్పటి యూపీఏ ప్రభుత్వం 123 ఆస్తుల్ని డీనోటిఫై చేసి వక్ఫ్ బోర్డుకు ఇచ్చిందని కిరణ్ రిజిజు అన్నారు. ఈ రోజు ఈ బిల్లు ప్రవేశపెట్టకపోతే, మనం కూర్చున్న పార్లమెంట్ కూడా వక్ఫ్ ఆస్తిగా క్లెయిమ్ చేస్తారని అన్నారు. ప్రధాని మోడీ అధికారంలోకి రాకుంటే మిగతా ఆస్తుల్ని కూడా వక్ఫ్ బోర్డుకు అప్పగించేవారని ఆయన చెప్పారు.