PM Modi: మహాకుంభమేళాని ఎగతాళి చేసిన ప్రతిపక్ష నేతలపై ప్రధాని నరేంద్రమోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మత సంప్రదాయాలను అపహాస్యం చేస్తూ, సమాజాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తున్నారని మోడీ ఆదివారం ఆరోపించారు. మధ్యప్రదేశ్ ఛత్తర్‌పూర్‌లో జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ.. విశ్వాసాలు, సాంస్కృతిక ఆచారాలను అపహాస్యం చేసే రాజకీయ నాయకులను, భారతదేశ మత వారసత్వాన్ని దెబ్బతీసే ‘‘ బానిస మనస్తత్వం’’ కలిగిన వ్యక్తులుగా మోడీ అభివర్ణిస్తూ విమర్శించారు.
‘‘ఈ రోజుల్లో మతాన్ని ఎగతాళి చేసే, ప్రజలను విభజించే నాయకుల సమూహం ఉందని మనం చూస్తున్నాం. అనేక సార్లు విదేశీ శక్తులు కూడా ఈ వ్యక్తులకు మద్దతు ఇవ్వడం ద్వారా దేశాన్ని, మతాన్ని బలహీన పరచాలని ప్రయత్నిస్తున్నారు. హిందూ విశ్వాసాన్ని ద్వేషించే వ్యక్తులు శతాబ్ధాలుగా ఏదో ఒక దశలో జీవిస్తూనే ఉన్నారు. ’’ అని అన్నారు. దేవాలయాలు, పండగలు, సంప్రదాయాలను లక్ష్యంగా చేసుకునే వారిని ప్రధాని తీవ్రంగా విమర్శించారు. వారి ఎజెండా సామాజిక ఐక్యతను దెబ్బతీయడమే అని చెప్పారు.
Read Also: Sudeep : హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో కూతురు
ప్రధాని తన ప్రసంగంలో భాగేశ్వర్ ధామ్ ఆధ్యాత్మిక నాయకుడు ధీరేంద్ర శాస్త్రిని ప్రశంసించారు. ధీరేంద్ర శాస్త్రి ఐక్యతను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. మతపరమైన ప్రదేశంలో క్యాన్సర్ కోసం ఒక ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయడంపై ప్రధాని ప్రశంసించారు. భాగేశ్వర్ ధామ్ ఇప్పుడు అవసరమైన వారికి వైద్య సాయం కూడా అందిస్తుందని మోడీ అన్నారు.
కుంభమేళని ప్రశ్నిస్తూ కాంగ్రెస్, సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. త్రివేణి సంగమంలో స్నానం చేస్తే పేదరికం పోతుందా..? అంటూ కాంగ్రెస్ చీఫ్ ఖర్గే వ్యాఖ్యానించాడు. కుంభమేళాలో తొక్కిసలాటను ప్రస్తావిస్తూ ‘‘మృత్యు కుంభ్’’అంటూ మమతా బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సమాజ్ వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కుంభమేళపై ప్రభుత్వాన్ని నిందిస్తున్నాడు. ఎస్పీ ఎంపీ జాయా బచ్చన్ మాట్లాడుతూ.. గంగానదిలోకి మృతదేహాలను విసిరేశారని అన్నారు. ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ కుంభమేళా పనికిరానిది గా కొట్టిపారేశారు.