PM Modi: ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటన ముగిసింది. మూడు రోజలు పాటు ఈయన అమెరికాలో బిజీబీజీగా పర్యటించారు. ఈ రోజు ఆయన ఈజిప్టు పర్యటనకు బయలుదేరారు. రెండు రోజుల పాటు ఆయన ఈజిప్టులో పర్యటించనున్నారు. 1997 తర్వాత తొలిసారిగా భారత ప్రధాని ఈజిప్టు పర్యటనకు వెళ్తున్నారు. ప్రధాని మోడీ ఈజిప్టులో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్ సిసి హాజరయ్యారు. ఆ సమయంలో ప్రధాని మోడీని ఈజిప్టులో పర్యటించాల్సిందిగా కోరారు. అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్ సిసి ఆహ్వానం మేరకు ప్రధాని ఈజిప్టు వెళ్తున్నారు.
Read Also: El Nino: ప్రాణాంతక వైరస్‌ల ప్రమాదం.. కారణం ఎల్ నినో.. డబ్ల్యూహెచ్ఓ వార్నింగ్
ఈ పర్యటనలో ఈజిప్టులోని భారత సంతతిని, ప్రముఖ వ్యక్తులను కలుసుకోవడంతో పాటు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల మరింతగా బలపడేందుకు ప్రధాని మోడీ, ఎల్ సిసితో చర్చలు జరపనున్నారు. కైరోలోని హీలియోపోలిస్ కామన్వెల్త్ వార్ గ్రేవ్ శ్మశానవాటికను ప్రధాని సందర్శిస్తారు, ఇది మొదటి ప్రపంచ యుద్ధంలో ఈజిప్ట్ మరియు పాలస్తీనాలో సేవ చేసి మరణించిన భారతీయ సైన్యానికి చెందిన దాదాపు 4,000 మంది సైనికులకు స్మారక చిహ్నంగా ఉంది. దావూదీ బోహ్రా కమ్యూనిటి సాయంతో పునరుద్ధరించిన 11వ శతాబ్ధపు అల్-హకీమ్ మసీదును కూడా ఆయన సందర్శిస్తారు.
అంతకుముందు ప్రధాని జూన్ 21 నుంచి 23 వరకు అమెరికాలో పర్యటించారు. అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వనం మేరకు ప్రధాని స్టేట్ విజిట్ కు వెళ్లారు. వైట్ హౌజులో బైడెన్ దంపతులు మోడీకి విందు ఇచ్చారు. అమెరికా ఉభయసభల సంయుక్త సమావేశంలో ఆయన ప్రసంగిచారు. ఈ పర్యటనలో భారత్ అమెరికా మధ్య రక్షణ, స్పేస్, టెక్నాలజీ రంగాల్లో పలు ఒప్పందాలు కుదిరాయి. ప్రముఖ చిప్ కంపెనీ మైక్రాన్ భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఒకే చెప్పింది. దీంతో పలు జనరల్ ఎలక్ట్రానిక్స్, గూగుల్ ఇతర ప్రముఖ కంపెనీల సీఈఓలతో మోడీ భేటీ అయ్యారు. భారత కమ్యూనిటీ ప్రజలు ఉద్దేశించి ప్రసంగించారు.