El Nino: ప్రపంచం ఇప్పుడిప్పుడే కోవిడ్ బారి నుంచి కోలుకుంటోంది. పాండమిక్ దశ నుంచి ఎండమిక్ దశకు చేరుకుంది. దీంతో అన్ని దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే రానున్న రోజుల్లో మరింతగా వైరస్‌లు విజృంభించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. అయితే దీనికి కారణం ఎల్ నినో అనే వాతావరణ పరిస్థితి అని తెలిపింది. దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత ఎల్ నినో తిరిగి రావడంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వాతావరణం, ఆర్థిక క్షీణత, వ్యవసాయం పై ప్రభావం ఉండే అవకాశం ఉంది.
ఉష్ణమండల వ్యాధులు పెరిగే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ హెచ్చరించారు. డెంగ్యూ, జికా, చికున్ గున్యా వంటి ఆర్బో వైరస్ పెరుగే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఎల్ నినో వల్ల ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో వేడి వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. దీని వల్ల వైరస్‌లను ప్రసారం చేసే దోమలు వృద్ధి చెందుతాయి. ఇప్పటికే దక్షిణ అమెరికా నుంచి ఆసియా వరకు ఉన్న ప్రాంతాలు ఉష్ణమండల వ్యాధుల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్నాయి. దక్షిణ అమెరికా దేశం పెరూలో ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపుగా 1,50,000 అనుమానిత డెంగ్యూ కేసులు నమోదు కావడంతో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అంటు వ్యాధులు పలు దేశాల ఆర్థిక వ్యవస్థపై భారీ నష్టాన్ని కలిగిస్తాయని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది.
థాయిలాండ్ మూడు సంవత్సరాలలో అత్యధిక సంఖ్యలో డెంగ్యూ కేసులను చూసింది, 2023 ప్రారంభం నుండి జూన్ మొదటి వారం వరకు స్థానిక ఆరోగ్య అధికారులు 19,503 మందిని నివేదించారు. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం మలేషియా, కంబోడియాల్లో కూడా కేసులు పెరుగుతున్నాయి జూన్, అక్టోబర్ మధ్య కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సింగపూర్ అధికారులు ఈ ఏడాది ప్రారంభంలో హెచ్చరించారు. గతేడాది చికున్ గున్యా వ్యాప్తి కారణంగా పరాగ్వేలో కనీసం 40 మంది మరణించారు.
ఎల్ నినో అనేది ఒక వాతావరణ పరిస్థితి. ఇది రుతుపవనాలపై ప్రభావం చూపిస్తుంది. పసిఫిక్ మహా సముద్రంలో వాతావరణం వెడెక్కడం వల్ల ఇది ఏర్పడుతుంది. దీంతో కొన్ని దేశాల్లో సాధారణానికి భిన్నంగా వాతావరణం మారుతుంది. ఉష్ణోగ్రతల పెరగడం, వర్షాలు తగ్గడం వంటివి ఏర్పడుతాయి.