Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే.. రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జులై 18 నుంచి ఆగష్టు 12 వరకు ఈ సెషన్ కొనసాగనుంది. అయితే.. మొత్తం 26 రోజుల వ్యవధిలో దాదాపు 18 రోజులు ఉభయ సభలు భేటీ కానున్నాయి. దాదాపు 24 కీలక బిల్లులను కేంద్రం సభల ముందుకు తీసుకురానుంది. లోక్‌సభలో పెండింగ్‌లో ఉన్న ఇండియన్ అంటార్కిటిక్ బిల్లు 2022, ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ బిల్లు 2019, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అండ్ డోర్ డెలివరీ సిస్టం సవరణ బిల్లు 2022 లోక్‌సభలో పాసై రాజ్య సభ ముందుకు రానున్నాయి. కొత్తగా సెంట్రల్ యూనివర్సిటీల సవరణ బిల్లు–2022, ది ఫ్యామిలీ కోర్ట్స్(సవరణ) బిల్లు–2022తోపాటు కొన్ని కీలక బిల్లులను కేంద్రం సభలలో ప్రవేశపెట్టనుంది.
మరోవైపు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అగ్నిపథ్ పథకం తదితర అంశాలను ప్రతిపక్షాలు లేవనెత్తనున్నాయి. చమురు, గ్యాస్ ధరలు, అగ్నిపథ్, రూపాయి విలువ పతనం, సరిహద్దుల్లో చైనాతో పెరిగిన ఉద్రిక్తతలు, ప్రతిపక్షాలను బలహీనం చేసేందుకు ఈడీ, సీబీఐ దాడులు, ప్రజాస్వామ్యం గొంతునొక్కే చర్యలపై ఈ సమావేశాల్లో తీవ్ర నిరసన తెలిపేందుకు ప్రతిపక్షాలు సంఘటితమవుతున్నాయి. వర్షాకాల సమావేశాలు పట్టుమని 15 రోజులు జరగకపోయినా ప్రభుత్వం 24 కొత్త బిల్లులతో సిద్ధమవుతోంది. ప్రతిపక్షాలు సహకరించినా, సహకరించకపోయినా రోజుకు రెండు బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే మరో 8 బిల్లులు ఉభయ సభల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.
Presidential Poll 2022: నేడే రాష్ట్రపతి ఎన్నిక.. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని అన్ని పార్టీల సభ్యులను ఇప్పటికే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కోరారు. జీరో అవర్లో అంశాలను లేవనెత్తేందుకు నోటీసు సమర్పణ సమయంలో మార్పు చేసినట్లు వెల్లడించారు. కాగా.. దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై చర్చించాలని నేతల్ని కోరారు. ‘సభ సజావుగా జరిగేలా చూడండి.. మీరు నాకిచ్చే వీడ్కోలు బహుమతి ఇదే’ అని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభకు ఛైర్మన్ హోదాలో చివరిసారిగా ఆయన నేతృత్వం వహించబోతున్నారు. ఆదివారం సాయంత్రం 41 మంది పార్టీల నేతలు, కేంద్ర మంత్రులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యారు. ఎగువ సభ గౌరవ మర్యాదలను నిలబెట్టడానికి ప్రతి ఒక్కరూ కృషిచేయాలని అర్థించారు.