Pakistan: పాకిస్తాన్ మరింత దిగువ స్థాయికి చేరుకుంటోంది. సొంత దేశ పౌరుల్ని కూడా సరిహద్దు దాటి రానివ్వడం లేదు. ఇండియా నుంచి స్వదేశమైన పాకిస్తాన్ వెళ్తున్న పౌరుల్ని రానీవ్వడం లేదు. దీంతో అట్టారీ-వాఘా సరిహద్దు వద్ద దౌత్యపరమైన ప్రతిష్టంభన నెలకొంది. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి పాకిస్తాన్ తన రీసీవింగ్ కౌంటర్లను మూసేసిందని భారత ఇమ్మిగ్రేషన్ అధికారులు ధ్రువీకరించారు. దీని ఫలితంగా చాలా మంది పాకిస్తాన్ జాతీయులు సరిహద్దుల్లో చిక్కుకుపోయారు.
Read Also: Pahalgam Attack: Z-మోర్హ్ ఘటనలో ఆరుగురు కార్మికులు, వైద్యుడిని చంపింది “పహల్గామ్” టెర్రరిస్టులే..
వృద్ధులు, మహిళలు, పిల్లలతో సహా పాకిస్తాన్ పౌరులు ఇప్పుడు ఆశ్రయం, ఆహారం లేకుండా చిక్కుకున్నారు. పాకిస్తాన్ వైపు నుంచి అకస్మాత్తుగా ఇలా చేయడంపై సొంతదేశ ప్రజలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ తీరుపై అట్టారి పోస్ట్ వద్ద భద్రతను పెంచారు. మరోవైపు, పాకిస్తాన్ వైఖరికి విరుద్ధంగా, భారత ప్రభుత్వం తదుపరి నోటీసులు వచ్చే వరకు పాకిస్తాన్ పౌరులు అట్టారి-వాఘా సరిహద్దు ద్వారా తిరిగి వెళ్లడానికి అనునమతించింది. గతంలో, హోంమంత్రిత్వ శాఖ ఏప్రిల్ 30లోగా భారత్‌లో ఉంటున్న పాకిస్తాన్ జాతీయులు తిరిగి వెళ్లాలని ఆదేశించింది. ఇప్పుడు ఈ ఆదేశాలను సవరించింది.
కేంద్రం ఈ ఆదేశాలు జారీ చేసిన వారం రోజుల్లో దాదాపుగా 800 మంది పాకిస్తానీ జాతీయులు, 55 మంది దౌత్యవేత్తలు, వారి సహాయక సిబ్బంది పాకిస్తాన్ తిరిగి వెళ్లారు. దాదాపుగా 1500 మంది భారతీయులు పాకిస్తాన్ నుంచి తిరిగి వచ్చారు.