Pakistan: పాక్‌లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్‌ను కవ్వించే చర్య..

  • గిల్గిట్-బాల్టిస్తాన్‌కు తాత్కాలిక ప్రావిన్స్ హోదా కోరిన అసెంబ్లీ.
  • అధికార, ప్రతిపక్ష సభ్యుల మద్దతుతో ఏకగ్రీవ తీర్మానం.
  • జాతీయ అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి.
  • గిల్గిట్-బాల్టిస్తాన్ భారత్ అంతర్భాగమేనన్న భారత వైఖరి యథాతథం.
Gilgit Baltistan

Gilgit Baltistan

Pakistan:  పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(PoK)లో భారీ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. అక్కడి ప్రజలు పాక్ ప్రభుత్వ అణచివేతకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. ఈ గొడవ ఇలా జరుగుతున్న సమయంలోనే పాకిస్తాన్ తెరచాటున భారత్‌ను కవ్వించే చర్యలకు పాల్పడుతోంది. పీఓకేలో భాగంగా ఉన్న గిల్గిట్-బాల్టిస్తాన్‌ను పాకిస్తాన్ తన భూభాగంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. పాక్‌లో 5వ ప్రావిన్సుగా(రాష్ట్రం) ఆ దేశ రాజ్యాంగంలో చేర్చాలని చూస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్‌లో పంజాబ్, సింధ్, బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా అనే 4 ప్రావిన్సులు ఉన్నాయి.

పాకిస్తాన్ పరిపాలన కింద ఉన్న గిల్గిట్-బాల్టిస్తాన్‌ ప్రాంతానికి తాత్కాలిక ప్రావిన్స్ హోదా కల్పించాలని కోరుతూ అక్కడి అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానానికి అధికార, ప్రతిపక్ష సభ్యులు అందరూ మద్దతు ఇవ్వడం విశేషం. అసెంబ్లీలో ఎమ్మెల్యే జలాల్ అలీ షా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. 2009లో గిల్గిత్-బాల్టిస్తాన్ (ఎంపవర్‌మెంట్ అండ్ సెల్ఫ్-గవర్నెన్స్) ఆర్డర్ ద్వారా శాసనసభ ఏర్పడింది. 2018 గిల్గిట్-బాల్టిస్తాన్ ఆర్డర్ ద్వారా శాసనసభకు మరిన్ని చట్టసభ అధికారాలు కల్పించిన విషయాన్ని తాజాగా ప్రవేశపెట్టిన తీర్మానంలో ప్రస్తావించారు. ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్‌లో తమకు రాష్ట్ర హోదా ఇవ్వాలని కోరుతున్నారు.

దివంగత నేత సర్టాజ్ అజీజ్ నేతృత్వంలోని కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేసి, గిల్గిట్-బాల్టిస్తాన్‌కు తాత్కాలిక ప్రావిన్స్ హోదా ఇవ్వాలని అసెంబ్లీ పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ హోదా లభిస్తే ఇక్కడి ప్రజలకు పాక్ జాతీయ అసెంబ్లీలో ప్రాతినిధ్యం లభిస్తుందని తీర్మానంలో పేర్కొన్నారు.

ఒక రకంగా చెప్పాలంటే ఈ తీర్మానం భారత్ సార్వభౌమాధికారాన్ని ధిక్కరించేదిగా ఉంది. గిల్గిట్-బాల్టిస్తాన్‌ను పాకిస్తాన్ వేరుగా పరిపాలిస్తోంది. ఇది జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లతో పాటు భారత్‌లో అంతర్భాగమే అని భారత్ ఎప్పటి నుంచో స్పష్టం చేస్తోంది. ఈ ప్రాంతాల హోదాను మార్చేందుకు పాకిస్తాన్ చేపట్టే ఏ చర్యకు కూడా చట్టబద్ధత లేదని, వాటితో వాస్తవ పరిస్థితి మారదని భారత్ పలుమార్లు పేర్కొంది.