Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ తన యుద్ధ సన్నాహాలు చేసుకుంటోంది. భారత్ నుంచి ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఘర్షణ ప్రారంభమవుతుందో అని భయపడి చేస్తోంది. మరోవైపు, భారత్‌ని కవ్వించేలా పలు చర్యలకు పాల్పడుతోంది. ఇప్పటికే, ఎల్ఓసీ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ రేంజర్లు కాల్పులు ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. కరాచీ పోర్టులో పాక్ నేవీ తన నౌకల్ని, జలంతార్గముల్ని మోహరించినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే, తాజాగా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని మోహరించింది. రాజస్థాన్ సరిహద్దుల్లో ఎయిర్ డిఫెన్స్ తో పాటు ఆర్టిలరీ యూనిట్‌ని ఏర్పాటు చేసింది. రాజస్థాన్‌లోని బార్మెర్‌లోని లాంగేవాలా సెక్టార్ సమీపంలో అధునాతన రాడార్ వ్యవస్థలు, ఎయిర్ డిఫెన్స్ వెపన్స్ సిస్టమ్ మోహరించినట్లు తెలిసింది. పాక్ ఎయిర్ ఫోర్స్ ఒకేసారి మూడు విన్యాసాలను నిర్వహిస్తోంది. వీటిలో ఫిజా-ఎ-బదర్, లాల్కర్-ఎ-మోమిన్, జర్బ్-ఎ-హైదరీ ఉన్నాయి, F-16, J-10, JF-17 వంటి అన్ని ప్రధాన యుద్ధ విమానాల ఫ్లీట్‌లు ఉన్నాయని తెలుస్తోంది. ఈ విన్యాసాలను ఏప్రిల్ 29న పాకిస్తాన్ మోహరించింది.
Read Also: Pakistan: కరాచీ, లాహోర్ ఎయిర్‌స్పేస్‌ని పాక్షికంగా మూసేసిన పాకిస్తాన్..
పాకిస్తాన్ ఆర్మీ స్ట్రైక్ కార్ప్స్ కూడా వారి వారి ప్రాంతాల్లో ట్రైనింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. పాకిస్తాన్ ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ ఫోర్స్‌ని కూడా మోహరించింది. దీని ద్వారా తన గ్రౌండ్ అసెట్స్‌ని కాపాడుకోవాలని అనుకుంటోంది. చైనా నుంచి SH-15 హోవిట్జర్లను పాకిస్తాన్ సైన్యంలోకి చేరుతున్నాయి. ఈ యూనిట్లను ఫార్వర్డ్ లొకేషన్లలో మోహరిస్తోంది. పాక్ ఆర్మీ భారత సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించడం ప్రారంభించింది. నేవీని కూడా సిద్ధంగా ఉంచింది.
భారత వైమానిక దాడులను గుర్తించడానికి పాక్ సైన్యం తన రాడార్ వ్యవస్థల్ని సియాల్‌కోట్ సెక్టార్‌కి తరలిస్తోంది. ఫిరోజ్‌పూర్ సెక్టార్‌కి ఎదురుగా ఉన్న భారత కదలికల్ని గుర్తించడానికి పాక్ మిలిటరీ ఎలక్ట్రానిక్ యుద్ధ విభాగాలను మోహరించింది. దీనికి ముందు, పాకిస్తాన్ సమాచార మంత్రి అత్తౌల్లా తరార్ దేశానికి “విశ్వసనీయ నిఘా” అందిందని, భారతదేశం రాబోయే 24 నుండి 36 గంటల్లో సైనిక దాడి చేయవచ్చని అన్నారు.