Pakistan: దాయాది దేశం పాకిస్తాన్, భారత్‌లో అలజడి రేపేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ముఖ్యంగా జమ్మూకాశ్మీర్‌లో ఉన్న శాంతి పరిస్థితులు పాకిస్తాన్‌కి నచ్చడం లేదు. కాశ్మీర్‌లో దాడులు చేసేందుకు పాక్ స్పాన్సర్డ్ ఉగ్రవాదుల్ని నియంత్రణ రేఖ దాటించి భారత్‌లోకి పంపేందుకు ప్రయత్నిస్తోంది. అయితే గత రాత్రి నలుగురు ఉగ్రవాదుల్ని, భారత్ లోకి ప్రవేశపెట్టేందుకు పాకిస్తాన్ ఆర్మీ తీవ్రంగా ప్రయత్నించింది.
ఉగ్రవాదుల్ని సరిహద్దులు దాటించేందుకు, భారత నిఘాను మళ్లించేందుకు పాకిస్తాన్ తన సైనిక పోస్టును తానే నిప్పుపెట్టుకుంది. అయితే భారత సైన్యం చొరబాటు ప్రయత్నాలను తిప్పికొట్టింది. భారత సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించగా.. మరో ఇద్దరు పాకిస్తాన్ వైపు పారిపోయారు.
తెల్లవారుజామున ఇండియన్ ఆర్మీ 16 కార్ప్స్, అఖ్నూర్ సెక్టార్‌లో నలుగురు ఉగ్రవాదుల కదలికల్ని పసిగట్టింది. ఉగ్రవాదులు, సైన్యానికి మధ్య కాల్పులు జరిగాయి. ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఒకరి మృతదేహాన్ని మిగిలిన ఉగ్రవాదులు లాక్కెల్లడం కనిపించింది. ఉగ్రవాదులకు ప్రత్యక్షంగా పాకిస్తాన్ ఆర్మీ సహకరిస్తోంది. సరిహద్దుకు అవతల పాకిస్తాన్ ఆక్రమిత్ కాశ్మీర్(పీఓకే)లో ఎల్ఓసీని ఆనుకుని పలు ఉగ్రవాద తండాలు ఉన్నాయి. వీటిని లాంచింగ్ ప్యాడ్స్‌గా ఉపయోగించుకుని ఉగ్రవాదుల్ని భారత్ లోకి ప్రవేశపెట్టేందుకు పాక్ ఆర్మీ ప్రయత్నిస్తోంది.
ఇదిలా ఉంటే గురువారం పూంచ్ లో ఉగ్రవాదులు ఆర్మీ వాహనాలపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు ఆర్మీ సిబ్బంది వీరమరణం పొందారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం ఇండియన్ ఆర్మీ భారీ ఆపరేషన్ ప్రారంభించింది.