BBC Documentary on Modi: గుజరాత్ అల్లర్లలో ప్రధాని నరేంద్ర మోదీ పాత్ర ఉందని ఆరోపిస్తూ బీబీసీ ప్రసారం చేసిన ‘‘ ఇండియా: ది మోదీ క్వశ్చన్’’ డాక్యుమెంటరీపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇది వలసవాద మనస్తత్వంలో ఉందని ఆరోపించింది భారత విదేశాంగశాఖ. మరోవైపు పలువురు బ్రిటన్ ఎంపీలు కూడా ఈ డాక్యుమెంటరీని తప్పుపడుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మాజీ భారత న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్లు, మేధావులు బీబీసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దాదాపుగా 300 మంది బీబీసీ డాక్యుమెంటరీకి వ్యతిరేకంగా ప్రధాని మోదీకి మద్దతుగా సంతకాలు చేస్తూ ఓ ప్రకటనను విడుదల చేశారు. హిందూ-ముస్లింల మధ్య ఉద్రిక్తతలను పెంచడానికి, గతంలో బ్రిటిష్ సామ్రాజ్యవాద పాలకులు చేసిన విధంగానే బీబీసీ చేస్తుందని దుయ్యబట్టారు. భారత ప్రధానిని ఇలా విమర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే భారత ప్రభుత్వం ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన ట్వీట్లు, వీడియో లింకులను యూట్యూబ్, ట్విట్టర్ నుంచి తొలగించాలని ఆదేశించింది.
Read Also: Himanta Biswa Sarma: “షారుఖ్ ఖాన్ ఎవరు..?” అస్సాం సీఎం ప్రశ్న..
13 మంది మాజీ న్యాయమూర్తులు, 133 మంది మాజీ బ్యూరోక్రాట్లు, దౌత్యవేత్తలు మరియు 156 మంది మేధావులు సంతకం చేసినవారిలో ఉన్నారు. స్వతంత్ర భారతదేశం యొక్క 75 ఏళ్ల అస్తిత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని, భారత ప్రజల అభిష్టాన్ని ఈ డాక్యుమెంటరీ ధిక్కరిస్తోందని వారు పేర్కొన్నారు. లేఖలో సంతకాలు చేసిన వారిలో రాజస్థాన్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అనిల్ డియో సింగ్, హోం శాఖ మాజీ కార్యదర్శి ఎల్‌సి గోయల్, మాజీ విదేశాంగ కార్యదర్శి శశాంక్, రా మాజీ చీఫ్ సంజీవ్ త్రిపాఠి, ఎన్‌ఐఏ మాజీ డైరెక్టర్ యోగేష్ చందర్ మోదీ ఉన్నారు.
2002 నాటి గుజరాత్ అల్లర్లలో నరేంద్ర మోదీ పాత్ర లేదని భారత అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. అయినా వీటిని పట్టించుకోకుండా బీబీసీ ఈ డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) ముస్లింలకు అన్యాయం చేసిందని బీబీసీ పేర్కొంది. అయితే ఇది వాస్తవానికి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు బంగ్లాదేశ్‌లలో మతపరమైన హింసను ఎదుర్కొంటున్న మైనారిటీలకు సహాయం చేసే చట్టం మరియు భారతీయ ముస్లింలతో ఎటువంటి సంబంధం లేదు.