Olive Ridley turtles: తూర్పు తీరం తాబేళ్ల మృత్యుకుహరంలా మారుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సముద్ర తాబేళ్లు డిసెంబరు ఏప్రిల్ మధ్య గుడ్లు పెట్టేందుకు హిందూ మహాసముద్రంలోని గల్ఫ్ ఆఫ్ మన్నార్ జలాల నుంచి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరాల వైపు వస్తుంటాయి. ఇక్కడి ఇసుక తిన్నెల్లో ప్రాణం పోసుకున్న బుల్లి తాబేళ్లు, అటుపోట్ల సమయంలో సముద్రంలోకి జారుకొని జీవనం సాగిస్తాయి. ఈ ప్రకృతి ధర్మం ఇటీవల లయ తప్పినట్లు పర్యావరణవేత్తలు, పరిశోధకులు గుర్తించారు. గుడ్లు పెట్టెందుకు వస్తున్న తాబేళ్లు వందల సంఖ్యలో చనిపోతూ తీరానికి కొట్టుకువస్తున్నాయి. చెన్నై, పరిసర తీరాల్లోనే ఇటీవల 1200 వరకు భారీ తాబేళ్ల కళేబరాలు కుళ్లిన స్థితిలో ఒడ్డుకు చేరాయి. వారం రోజులుగా ఈ మరణాల తీవ్రత పెరిగింది.
Read Also: Keeway k300 sf: ఈ బైక్‌పై రూ. 60 వేల డిస్కౌంట్.. రూ. 3 వేలతో బుక్ చేసుకోవచ్చు
చైన్నైలోని జెసెంట్ నగర్, మెరీనా బీచ్లో ఇటీవల 400కు పైగా తాబేళ్ల కళేబరాల్ని తమిళనాడు అటవీ, మత్స్య శాఖల అధికారులు గుర్తించారు. శివారులోని నీలా౦గరై, ఉత్తండి బీచ్ల మధ్య 500కు పైగా బయటపడ్డాయి. పర్యాటకులతో రద్దీగా ఉండే కోవలం బ్లూఫ్లాగ్ బీచ్లోనూ వంద వరకు చనిపోయాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరాల్లోనూ పలుచోట్ల ఇలాంటి పరిస్థితే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. చెన్నై పరిసరాల్లో దొరికిన కళేబరాల నమూనాలను పరీక్షల నిమిత్తం తమిళనాడు పశుసంవర్ధక, జంతుశాస్త్ర విశ్వవిద్యాలయానికి పంపారు. పోస్టుమార్టానికి వీల్లేని వాటిని తీరాల్లోనే ఎక్కడికక్కడ పూడ్చి పెడుతున్నారు. 10-15 రోజుల క్రితం చనిపోయిన తాబేళ్ల కళేబరాలు తమిళనాడు, ఏపీ తీరాల వైపు వస్తున్నాయి.
ఈ సీజన్లో గుడ్లు పెట్టేందుకు వస్తున్న తాబేళ్లే బలవుతున్నాయి. పుట్టిన తాబేళ్లలో సాధారణంగా వెయ్యికి ఒక్కటి మాత్రమే బతుకుతుంది. మిగిలినవి సముద్ర జీవులకు ఆహారంగా మారుతాయి. చేపల వేటకు మరబోట్ల వాడకం తాబేళ్లకు ప్రాణసంకటంగా మారిందని సమాచారం. ఇక తమిళనాడు ప్రభుత్వం తాబేళ్ల మరణాలపై తీవ్రంగా స్పందించింది. మరబోట్ల పై కఠిన ఆంక్షలు విధించింది. ఆటవీ, మత్స శాఖలతో పాటు తీరగస్తీ దళాల సిబ్బంది ఇటీవల 22 మరబోట్లను స్వాధీనం చేసుకొని, కేసులు పెట్టారు. తాబేళ్ల మరణాలపై చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్ దక్షిణాది బెంచ్ సుమోటోగా విచారణ ప్రారంభించింది. నిబంధనల ప్రకారం తీరంలో 9.26 కి.మీ. 5 నాటికల్ మైళ్ళలోపు మరబోట్లలో చేపల వేట పై నిషేదం ఉంది. దీన్ని అతిక్రమించి పలువురు బోట్లను వాడుతున్నారు.కొందరు మరబోట్లలో కత్తులు, పెట్రోలు బాంబులు పెట్టుకుని వేట సాగిస్తున్నట్లు గుర్తించారు. 5 నాటికల్ మైళ్లలోపు చేపలు పట్టుకునేందుకు సంప్రదాయ బోట్లు వాడేవారికి మాత్రమే అనుమతి ఉంది.