Mallikarjun Kharge: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ‘‘మహా కుంభమేళా’’పై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే వివాదాస్పద కామెంట్స్ చేవారు. గంగా నదిలో పుణ్యస్నానాలు చేస్తే పేదరికం పోతుందా..? అని బీజేపీ నేతల్ని ఆయన ప్రశ్నించారు. మధ్యప్రదేశ్ మోవ్‌లో జరుగుతున్న ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ ర్యాలీలో సోమవారం ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులు కెమెరాల కోసం స్నానాలు చేస్తున్నారని ఆరోపించారు.
గంగా నదిలో స్నానాలు చేయడం వల్ల దేశంలో పేదరికం అంతమవుతుందా.? ఆకలితో ఉన్న కడుపులు నిండుతాయా.? అని కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రశ్నించారు. ‘‘ నేను ఎవరి విశ్వాసాలను ప్రశ్నించాలనుకోవడం లేదు. ఎవరైతే బాధపడితే, నేను క్షమాపణలు కోరుతున్నాను. ఒక పిల్లవాడు ఆకలితో చనిపోతున్నప్పుడు, పాఠశాలకు వెళ్లలేకపోతున్నప్పుడు, ఈ ప్రజలు వేల రూపాయలు ఖర్చు చేసి గంగానిదిలో స్నానం చేయడానికి పోటీ పడుతున్నారు’’ అని అన్నారు. ఇలాంటి వ్యక్తులతో దేశానికి ప్రయోజనం లేదని, మతం పేరుతో పేదలు దోపిడికి గురవుతున్నారన్నదే తమ సమస్య అని ఖర్గే అన్నారు.
Read Also: Nadendla Manohar: పేదలకు భూములు ఇచ్చే పేరుతో తెనాలిలో భారీ స్కామ్ జరిగింది..
కేంద్ర హోం మంత్రి కుంభమేళాలో సోమవారం త్రివేణి సంగమంలో స్నానం చేసిన తర్వాత ఖర్గే నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. అయితే, ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగానే స్పందించింది. కాంగ్రెస్ ద్వేషంతో కోట్లాది హిందువుల విశ్వాసాలపై దాడి చేస్తూనే ఉందని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర అన్నారు. మహా కుంభమేళా యుగయుగాల సనాతన విశ్వానికి చిహ్నంగా ఉందని, ప్రపంచం మొత్తం ఈ విశ్వాసాలను గౌరవిస్తుంటే, కాంగ్రెస్ మాత్రం ఈ విశ్వాసాన్ని అపహాస్యం చేస్తుందని ఆయన అన్నారు. హిందూ విశ్వాసాలపై వ్యాఖ్యలు చేసే కాంగ్రెస్ నేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గేలు దమ్ముంటే వేరే మత విశ్వాసాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయగలుగుతారా..? అని ప్రశ్నించారు. ఇఫ్తార్ విందులకు వెళ్తే పేదరికం పోతుందా.? అని ఖర్గేని బీజేపీ ప్రశ్నించింది.