Kanwar Yatra: ఉత్తర్ ప్రదేశ్‌లో కన్వర్ యాత్ర వివాదం దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారి తీసింది. యూపీ ముజఫర్‌నగర్ జిల్లా మీదుగా సాగే ఈ యాత్ర మార్గంలోని దుకాణదారులు, తమ పేరు కనిపించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని జిల్లా పోలీసులు ఆదేశించారు. ఇప్పుడు ఇది వివాదాస్పదమైంది. ఈ నిబంధనలు రాజ్యాంగ వ్యతిరేకమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వర్ణవివక్ష, హిట్లర్ నాజీ రూల్స్ అంటూ ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు.
Read Also: Nipah Virus: నిపా వైరస్ సోకిన 14 ఏళ్ల బాలుడు గుండెపోటుతో మృతి..
ఇదిలా ఉంటే, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు ఈ రోజు జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాలు కన్వర్ యాత్ర వివాదం, నీట్ పరీక్ష అంశాలను లేవనెత్తాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బీజేపీ నుంచి జేపీ నడ్డా, కిరణ్ రిజిజు హాజరయ్యారు. కాంగ్రెస్ నుంచి గౌరవ్ గొగోయ్, జైరాం రమేష్, కే సురేష్ హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎల్‌జేపీ (రామ్‌విలాస్) నాయకుడు చిరాగ్ పాశ్వాన్, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన రామ్ గోపాల్ యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సంజయ్ సింగ్, ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీ, ఎన్సీపీ నుంచి ప్రఫుల్ పటేల్ హాజరయ్యారు.
ఈ సమావేశాంలో కన్వయ్ యాత్ర మార్గంలో తినుబండారాల యజమానులు తమ పేర్లను ప్రదర్శించాలని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన వివాదాస్పద ఉత్తర్వులను సమాజ్‌వాదీ పార్టీ, ఆప్ లేవనెత్తాయి. కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ.. లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ స్థానం ప్రతిపక్షానికి కేటాయించాలని, ఆ స్థానాన్ని ఖాళీగా ఉంచకూడదని కోరారు. జనతాదల్, ఎల్జేపీ పార్టీలు బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్‌ని లేవనెత్తారు. ఏపీకి కూడా ప్రత్యేక హోదా కేటాయించాలని వైఎస్సార్సీపీ కోరింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 22 నుంచి ప్రారంభం కానున్నాయి. జూలై 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. నీట్ పేపర్ లీక్, వరసగా రైలు ప్రమాదాలపై ప్రతిపక్షాలు బీజేపీని ఇరుకున పెట్టేందుకు అస్త్రాలను రెడీ చేసుకుంటున్నాయి.