Nipah Virus: కేరళ రాష్ట్రంలో నిపా వైరస్ మరోసారి కలకలం రేపుతోంది. మలప్పురం జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలుడికి ఈ వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. ఆదివారం చికిత్స పొందతూ బాలుడు మరణించినట్లు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ఆదివారం ఉదయం 10.50 గంటలకు బాలుడికి తీవ్రమైన గుండెపోటు వచ్చిందని, అతడిని బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు ఆమె వెల్లడించారు. ‘‘ వెంటిలేటర్‌పై బాలుడికి చికిత్స అందిస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి మూత్ర విసర్జన తగ్గింది. కార్డియాక్ అరెస్ట్ తర్వాత, డాక్టర్లు అతడిని బతికించే ప్రయత్నాలు చేసినా విఫలమయ్యాయి. 11.30 గంటలకు అతను మరణించాడు’’ అని వీణా జార్జ్ తెలిపారు.
Read Also: Bangladesh : పోలీసులు కర్ఫ్యూను పొడగింపు.. షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్.. 114మంది మృతి
నిపా ప్రోటోకాల్ ప్రకారం అంత్యక్రియనను నిర్వహించనున్నట్లు మంత్రి చెప్పారు. బాలుడి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులతో జిల్లా కలెక్టర్ చర్చించిన తర్వాతే అంత్యక్రియలకు సంబంధించిన మరిన్ని విషయాలను నిర్ణయిస్తామని జార్జ్ తెలిపారు. గతంలో నాలుగు సార్లు రాష్ట్రాన్ని వణికించిన నిపా వ్యాధి నివారణకు ప్రత్యేక కార్యాచరణ క్యాలెండర్ రూపొందించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. 2019, 2021, 2023లో కోజికోడ్ జిల్లాలో, 2019లో ఎర్నాకులం జిల్లాలో నిపా వ్యాప్తి నమోదైంది. కోజికోడ్, వాయనాడ్, ఇడుక్కి, మలప్పురం, ఎర్నాకులం జిల్లాల్లోని గబ్బిలాలలో నిపా వైరస్ యాంటీబాడీల ఉనికిని గుర్తించారు.