ఆపరేషన్ గంగ కార్యక్రమంలో భాగంగా ఆదివారం వరకు 73 విమానాల్లో 15,206 మందిని భారత్ తీసుకొచ్చినట్టు పౌర విమానయాన శాఖ ప్రకటించింది. అలాగే 10 ఎయిర్‌ఫోర్స్ విమానాల్లో 2056 మందిని తరలించినట్టు తెలిపింది. సోమవారం 7 విమానాల్లో 1314 మంది భారత్ వచ్చినట్టు వివరించింది. మొత్తంగా ఫిబ్రవరి 22న ఆపరేషన్ గంగ మొదలైనప్పట్నుంచి ఉక్రెయిన్ పొరుగు దేశాల నుంచి 17,400 మందికి పైగా భారతీయులను సొంత దేశానికి తరలించామని వివరించింది. మంగళవారం మరో 2 విమానాలు భారత్ రానున్నాయి. దీంతో, ఆపరేషన్ గంగ దాదాపు చివరి దశకు చేరినట్టు అయ్యింది.. అయితే మరో రెండు వేల మంది వరకు రొమేనియా, స్లొవేకియా, మాల్డోవా దేశాల్లో భారత్ వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని విదేశాంగ శాఖ తెలిపింది.
Read Also: Women’s Day 2022: సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు.. మానవ జాతికి మహిళ ఒక వరం
హంగెరీ నుంచి తరలింపు ముగిసింది. లాస్ట్ బ్యాచ్ తో భారత్ వచ్చేశారు కేంద్రమంత్రి హర్‌దీప్ సింగ్ పురి. అలాగే ఉక్రెయిన్ లోని వార్‌జోన్ గా ఉన్న సుమీ సిటీలోనూ దాదాపు 600 మంది భారతీయులు ఉన్నట్టు ప్రకటించింది. వారిని కూడా తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపింది. మరోవైపు, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీతో ఫోన్‌లో మాట్లాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఉక్రెయిన్‌లో పరిస్థితులను, రష్యా సైన్యాన్ని కౌంటర్ చేస్తున్న విధానాన్ని మోడీకి వివరించారు జెలెన్‌స్కీ. భారతీయుల తరలింపునకు సహకరిస్తున్నందకు థ్యాంక్స్ చెప్పారు మోడీ. తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో మాట్లాడారు మోడీ. 50 నిమిషాల పాటు వీరి మధ్య చర్చ జరిగింది. ఉక్రెయిన్-రష్యా ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలకు సంబంధించిన అంశాలను మోడీకి వివరించారు పుతిన్. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో నేరుగా మాట్లాడాలని పుతిన్ కు విజ్ఞప్తి చేశారు మోడీ. సుమీ నుంచి భారతీయులందరినీ సురక్షితంగా తరలించడం తమకు ప్రాధాన్యమని మోడీ చెప్పారు. భారతీయులను తరలించే విషయంలో అవసరమైన సహకారం అందిస్తామని పుతిన్ హామీ ఇచ్చారు.