Uniform Civil Code: కేంద్రంలోని బీజేపీ సర్కార్ ‘ యూనిఫాం సివిల్ కోడ్’(యూసీసీ) బిల్లును ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల ప్రధాని దీనిపై కీలక వ్యాఖ్యలు చేయడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. పలు విపక్షాలు, ముస్లిం, సిక్కు మత సంస్థలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. అయితే యూసీసీపై బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నౌ ఆర్ నెవర్’ అంటూ ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడుంటూ వ్యాఖ్యానించారు.
Read Also: Semiconductor: ఇండియాకు క్యూ కడుతున్న చిప్ కంపెనీలు.. ఒడిశాలో యూనిట్ పెట్టేందుకు యూకే సంస్థ ప్లాన్..
విపక్షాలు, కాంగ్రెస్ పార్టీలను లక్ష్యం చేసుకున్న నఖ్వీ, మత రాజకీయాలకు దూరంగా ఉండాలంటూ హితవు పలికారు. ఈ సమ్మిళిత సంస్కరణకు ఇదే మంచి సమయం అని.. అందరికీ సమానత్వం , న్యాయం కోసం యూనిఫాం సివిల్ కోడ్ అవసరం అని అన్నారు. యూసీసీ భారతదేశంలోని అందరి పౌరులకు మతం, కులం, వర్గం ప్రమేయం లేకుండా వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత విషయాల్లో ఒకే చట్టాలు ఉండాలని సూచిస్తుంది. తమ సంచుచిత ప్రయోజనాల కోసం గత ఏడు దశాబ్ధాలుగా ‘‘మతవాద కుట్రవాదుల’’ నుంచి విముక్తి పొందాలని దేశ అభిప్రాయం అని అన్నారు. 1985లో షాబానో కేసులో కాంగ్రెస్ చేసిన పొరపాటు దేశానికి దశాబ్ధాలుగా శిక్షగా మారిందని నఖ్వీ దుయ్యబట్టారు. ఇప్పటికీ కాంగ్రెస్ ఆ తప్పును దిద్దుకోవడం లేదని ఆయన మండిపడ్డారు.
ఈ వారం భోపాల్ లో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతున్న సమయంలో ప్రధాని నరేంద్రమోడీ యూసీసీపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం రెండు చట్టాలపై నడవదని ఆయన అన్నారు. కొందరు తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రజలను, యూసీసీకి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాజ్యాంగం ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించిందని, గతంలో యూసీసీని సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని ఆయన అన్నారు. జూలై 3న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం కానుంది. దీనికి లా కమిషన్, న్యాయమంత్రిత్వ శాఖ ప్రతినిధులను కూడా పిలిచింది.