రోజురోజుకు టెక్నాలజీ పెరిగిపోతోంది. అత్యాధునిక సదుపాయలతో మానవాళి కొత్తం పుంతలు తొక్కుతోంది. భారత్‌లో టెక్నాలజీని వినియోగించేందుకు ప్రధాని మోడీ డిజిటలైజేషన్‌కు శ్రీకారం చుట్టారు. ఆఫీసుల్లో, నగదు లావాదేవీల్లో సైతం డిజిటలైజేషన్ ప్రకారం పనులు జరుగాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. గత 5 సంవత్సరాల్లో దేశంలో నగదు రహిత లావాదేవీలు పెరిగాయి. అయితే.. దేశంలో యూపీఐ ఎంతగానే ఉపయోగపడుతోంది అని అనడంలో సందేహం లేదు. దేశంలో ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలం, గ్రామం ఇలా చెప్పుకుంటూ పోతే… చిన్న బడ్డీకొట్టు నుంచి.. పెద్ద పెద్ద గోల్డ్ షాపుల వరకూ యూపీఐ పేమెంట్లు జరుగుతున్నాయి.
అయితే రోజురోజుకు యూపీఐ పేమెంట్ వాడకం పెరిగిపోతోన్న నేపథ్యంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్ పీసీఐ) కీలక ప్రకటన చేసింది. ఇక నుంచి క్యూఆర్ స్కాన్ చేసి.. ఏటీఎంలలో నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.. ఒకవేళ మనం డెబిట్ కార్డు నుంచో, క్రెడిట్ కార్డు నుంచో డబ్బులు తీసుకోవాలన్నా.. ఆ లావాదేవీకి సంబంధించిన కార్డు లేకుండానే మనం డబ్బులు ఏటీఎం నుంచి విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే దేశంలో ఉన్న అన్ని ఏటీఎంలు ఒకదానితో ఒకటి అనుసంధానమై (ఇంటర్ ఆపరేబుల్) పనిచేసే విధంగా మార్పులు చేస్తున్నట్టు ఎన్‌పీసీఐ వెల్లడించింది.
ఈ సేవను పొందాలంటే సదరు ఏటీఎం యంత్రం యూపీఐ సర్వీస్ ను సపోర్ట్ చేస్తున్నదై ఉండాలని ఎన్‌పీసీఐ పేర్కొంది. ఏటీఎం మెషిన్ లో విత్ డ్రా క్యాష్ ను ఎంపిక చేసుకున్న.. తర్వాత ఏటీఎం స్క్రీన్‌పై యూపీఐ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. అక్కడ ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. ఫోన్ లో యూపీఐ యాప్‌ను తెరిచి ఏటీఎం స్క్రీన్ పై ఉన్న కోడ్ ను స్కాన్ చేసిన తర్వాత ఎంత డ్రా చేసుకోవాలన్నది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఇది రూ.5,000 వరకు గరిష్ఠ పరిమితిగా ఉంది. అంతకుమించి డ్రా చేసుకోవడానికి లేదు. ఆ తర్వాత ఏటీఎం పిన్ ను ఎంటర్ చేయాలి. అనంతరం లావాదేవీ ప్రాసెస్ అయి నగదు ఏటీఎం నుంచి బయటకు వస్తుంది.