Central Minister Anurag Thakur: వీధుల్లో నిరసనలు చేపట్టడం కాదని.. ప్రజాసమస్యలపై పార్లమెంటులో చర్చించాలని ప్రతిపక్షాలకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సూచించారు. మణిపూర్ అంశంపై పార్లమెంటులో చర్చ జరగకుండా విపక్షాలు పారిపోతున్నాయని విమర్శించారు. వీధుల్లో నిరసనలు చేయాలని కోరుకుంటే.. పార్లమెంటుకు ఎన్నికై ప్రయోజనం ఏముందని మండిపడ్డారు. మణిపూర్ అంశంపై చర్చకు పట్టుబడుతోన్న విపక్ష పార్టీలు.. వారం రోజులుగా పార్లమెంటులో నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. విపక్ష పార్టీల నిరసనలతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో విపక్ష పార్టీలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శలు గుప్పించారు. జులై 20న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి విపక్షాలు చేస్తున్న నిరసనలను ఉద్దేశిస్తూ ఠాకూర్ విమర్శలు చేశారు.
Read also: Fahadh Faasil: ఎవర్రా ఈ రత్నవేలు.. సోషల్ మీడియా అంతా ఒకటే మోత
‘మీరు వీధుల్లో నిరసనలు లేవనెత్తాలని కోరుకుంటే.. పార్లమెంటుకు ఎన్నికై ప్రయోజనం ఏమిటనీ కేంద్ర మంత్రి ఠాకూర్ ప్రశ్నించారు. దయచేసి సభకు వచ్చి.. చర్చలో పాల్గొనాలని విపక్షాలకు కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు. వారు కోరుకున్న మణిపూర్ అంశంపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. చర్చ నుంచి పారిపోవాల్సిన అవసరం విపక్షాలకు ఏముందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు. సోమవారం పార్లమెంటు బయట మీడియాతో మాట్లాడిన ఆయన.. మణిపూర్ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. దీనిపై ప్రకటన చేస్తానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పిన మాటలను గుర్తుచేశారు. ఇక మణిపూర్‌లో ‘ఇండియా’ బృందం చేసిన పర్యటనపై విమర్శలు చేసిన ఠాకూర్.. పశ్చిమ బెంగాల్‌లో వారెందుకు పర్యటించలేదని ప్రశ్నించారు. యూపీఏ హయాంలోనూ మణిపూర్‌లో ఆరు నెలలపాటు హింస చెలరేగిందని గుర్తు చేసిన కేంద్ర మంత్రి .. అప్పటి ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారని.. ఎందుకు పర్యటించలేదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు.