Congress: 26/11 ముంబై ఉగ్రదాడి సమయంలో యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్(ఏటీఎస్) అధికారి ఐపీఎస్ హేమంత్ కర్కేరే మరణించారు. అయితే ఈ హత్య చేసింది తీవ్రవాది అజ్మల్ కసబ్ కాదని, ఆర్ఎస్ఎస్‌తో అనుబంధం ఉన్న పోలీస్ జరిపిన కాల్పుల్లో ఆయన మరణించారని మహారాష్ట్ర కాంగ్రెస్ నేత విజయ్ నామ్‌దేవ్‌రావ్ వాడెట్టివార్ ఆరోపించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. హేమంత్ కర్కరే మరణాన్ని ఉద్దేశిస్తూ ముంబై నార్త్ సెంట్రల్ బీజేపీ అభ్యర్థి ఉజ్వల్ నికమ్‌పై విమర్శలు గుప్పించారు. అజ్మల్ కసబ్‌కి మరణశిక్ష విధించిన ఈ కేసు విచారణలో నికమ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉన్నారు.
‘‘బిర్యానీ ప్రస్తావన తీసుకువచ్చి నికమ్ కాంగ్రెస్ పరువు తీశాడు. కసబ్‌కి ఎవరైనా బిర్యానీ ఇస్తారా.. అందుకు తర్వాత నికమ్ ఒప్పుకున్నాడు. నికమ్ దేశద్రోహి. ముంబై పోలీసుని బలిగొన్న బుల్లెట్, కసబ్ తుపాకీ నుంచి రాలేదు. ఆ సమయంలో ఆర్ఎస్ఎస్‌కి విధేయుడైన ఓ పోలీస్ అధికారి నుంచి వచ్చింది. ఈ నిజాన్ని దాచిపెట్టిన ద్రోహికి బీజేపీ టిక్కెట్టు ఇస్తుంటే, బీజేపీ వీటికి ఎందుకు మద్దతిస్తుందనే ప్రశ్న తలెత్తుతోంది, బీజేపీ దేహద్రోహులకు మద్దతు ఇస్తుందా..? ’’ అని వాడెట్టివార్ అన్నారు.
వాడెట్టివార్ ప్రకటనపై బీజేపీ ఘాటుగా స్పందించింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే స్పందిస్తూ, కాంగ్రెస్ తన ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకోవడానికి ఎంతకైనా దిగజారుతుందని, వాడెట్టివార్ వ్యాఖ్యలు మరోసారి ఈ విషయాన్ని నిరూపిస్తున్నాయని, అతను ముంబై దాడులు ఉగ్రవాదికి క్లీన్ చిట్ ఇస్తున్నారని అన్నారు. ఉగ్రవాదులకు మద్దతిస్తున్నప్పుడు కాంగ్రెస్‌కి, యువరాజుకి సిగ్గు లేదా..? అని ప్రశ్నించారు.
వివాదం పెద్దది కావడంతో తన కప్పును కప్పిపుచ్చుకునేందుకు వాడెట్టివార్ ప్రయత్నిస్తున్నారు. తాను చేసిన వ్యాఖ్యలు నా మాటలు కావని, ఎస్ఎం ముష్రీఫ్ పుస్తకంలో రాసిన సమాచారాన్నే తాను చెప్పానని చెప్పారు. ముష్రిఫ్ రాసిన ‘హూ కిల్డ్ కర్కరే’ పుస్తకం గురించి వాడెట్టివార్ ప్రస్తావించారు. హేమంత్ కర్కరే ఉగ్రవాదుల బుల్లెట్లకు చనిపోలేదని, ఇది ఆ పుస్తకంలో ఉందని చెప్పారు. 26/11 ముంబై ఉగ్రదాడిలో మరణించిన హేమంత్ కర్కరేకు మరణానంతరం భారతదేశ అత్యున్నత శౌర్య పురస్కారం అశోక్ చక్ర లభించింది. కసబ్‌ని ఉరితీసే వరకు ఉజ్వల్ నికమ్ ప్రభుత్వం తరుపున పోరాడారు. ఆయన బీజేపీ టికెట్‌పై పోటీ చేస్తుండగా, ఆయనకు పోటీగా కాంగ్రెస్ నుంచి వర్షా గైక్వాడ్ పోటీలో ఉన్నారు.