Yogi On Babri Masjid: ఢిల్లీలో ఈరోజు ( డిసెంబర్ 6న) జరిగిన ఓ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. తన పదవీకాలంలో రాష్ట్రంలో “అల్లర్లు లేవు, కర్ఫ్యూ లేదు, అంతా బాగానే ఉంది” అని మరోసారి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం యూపీలో నెలకొన్న శాంతి- భద్రతలు గతంలో ఉన్న అస్థిరతతో పోల్చితే పూర్తిగా మారిపోయాయని పేర్కొన్నారు. బలమైన పోలీసింగ్ వ్యవస్థ, బాధ్యతాయుత ప్రభుత్వంతో ప్రజల భద్రతపై నమ్మకాన్ని పెంచినట్లు తెలిపారు. ఇక, 1992 డిసెంబర్ 6న అయోధ్యలో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేతలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ ఘటన రాష్ట్ర రాజకీయ, సామాజిక దృశ్యాన్ని పూర్తిగా మార్చివేశాయని తెలిపారు. సుప్రీంకోర్టు 2019 తీర్పుతో రామ్ మందిర నిర్మాణానికి మార్గం సుగమమై, 2024 జనవరి 22వ తేదీన జరిగిన ప్రతిష్టాపన తన జీవితంలో మర్చిపోని క్షణమని సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు.
Read Also: Yashasvi Jaiswal: వన్డేల్లో తొలి సెంచరీతో చెలరేగి.. శతకాల ఖాతా ఓపెన్ చేసిన జైస్వాల్
అయితే, 2017కి ముందు రాష్ట్రంలో తరచూ గొడవలు జరిగేవి.. కానీ, తన పాలనలో ఎలాంటి అల్లర్లు జరగలేదని సీఎం యోగి అన్నారు. దీనివల్ల ప్రజలు, వ్యాపార వర్గాల్లో భద్రతాభావం పెరిగి, ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం అయ్యాయని తెలిపారు. 2017 తర్వాత బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేరాలు, అవినీతి మీద జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంభించడం ద్వారా రాష్ట్ర ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసిందన్నారు. రాష్ట్రంలో రూ.12 లక్షల కోట్లు దాటిన పెట్టుబడి ప్రతిపాదనలు రావడం అభినందనీయం అని పేర్కొన్నారు. డిసెంబర్ 6వ తేదీ దేశ చరిత్రలో మలుపు తిప్పిన రోజు, సంస్కృతిక గౌరవం పునరుద్ధరణకు ప్రతీక అని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభివర్ణించారు.