అమెరికన్ డాలర్‌కి పోటీగా కొత్త కరెన్సీని ఏర్పాటు చేయాలనే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఖతార్ పర్యటనలో ఉన్న ఆయన నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ఇటీవల రష్యా వేదిక జరిగిన బ్రిక్స్ సమావేశం తర్వాత ‘‘బ్రిక్స్ కరెన్సీ’’ ఏర్పాటు చేస్తారనే వార్తలు వచ్చాయి. వర్థమాన ఆర్థిక వ్యవస్థలైన చైనా, భారత్, రష్యా వంటి బ్రిక్స్ కూటమి దేశాలు ఈ కరెన్సీపై కసరత్తు చేస్తున్నాయనే వార్తలు వచ్చిన నేపథ్యంలో అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి తీవ్ర హెచ్చరికలు వచ్చాయి.
బ్రిక్స్ సభ్యదేశాలు కరెన్సీని సృష్టించకుండా లేదా డాలర్ స్థానంలో మరో కరెన్సీకి మద్దతు ఇవ్వకుండా కట్టుబడి ఉండాలని ట్రంప్ డిమాండ్ చేశారు. ట్రంప్ హెచ్చరికల తర్వాత జైశంకర్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. బ్రిక్స్ దేశాలు డి-డాలరైజేషన్ విధానాన్ని ప్రారంభిస్తే, యూఎస్ డాలర్‌కి దూరంగా ఉంటే 100 శాతం టారిఫ్‌లను విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు.
Read Also: Bangladesh: పాకిస్తాన్ కోసం బంగ్లాదేశ్ కీలక నిర్ణయం.. భారత్‌కి సెక్యూరిటీ సమస్య..
‘‘అమెరికా-భారత్ మధ్య మంచి సంబంధం ఉంది. ట్రంప్ ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్‌తో చాలా దృఢమైన సంబంధాన్ని కలిగి ఉన్నాము. కొన్ని వాణిజ్యపరమైన సమస్యలు ఉన్నాయి. ట్రంప్ హయాంతోనే క్వాడ్ పున:ప్రారంభమైంది’’ అని జైశంకర్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ట్రంప్ మధ్య వ్యక్తిగత సంబంధాలు కూడా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు దోహదపడిందని జైశంకర్ అన్నారు.
‘‘ప్రధాని మోడీ మరియు ట్రంప్ మధ్య వ్యక్తిగత సంబంధం ఉంది. బ్రిక్స్ కరెన్సీ వ్యాఖ్యలకు సంబంధించి, భారతదేశం ఎప్పుడూ డి-డాలరైజేషన్ చేయలేదని మేము చెప్పాము, ప్రస్తుతం బ్రిక్స్ కరెన్సీని కలిగి ఉండాలనే ప్రతిపాదన లేదు. బ్రిక్స్ ఆర్థిక లావాదేవీల గురించి చర్చిస్తుంది. అమెరికా మా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి, డాలర్‌ను బలహీనపరిచేందుకు మాకు ఎలాంటి ఆసక్తి లేదు’’ అని జైశంకర్ అన్నారు.