Ayodhya Ram Temple: అయోధ్య భవ్య రామ మందిర ప్రారంభోత్సవం కోసం యావత్ దేశంతో పాటు ప్రపంచంలోని హిందువులు, రామ భక్తులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. జనవరి 22న ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా, 7000 మందికి పైగా అతిథులు, లక్షల మంది ప్రజల మధ్య రామ్ లల్లా(బాల రాముడి) విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగబోంది. ఈ మేరకు యూపీ సర్కార్‌తో పాటు సెంట్రల్ భద్రతా ఏజెన్సీలు అన్నీ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశాయి.
ఇదిలా ఉంటే రామ మందిర నిర్మాణంపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఆలయం వెయ్యి సంవత్సరాలకు పైగా ఉండేలా నిర్మించినట్లు ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్‌పర్సన్ శ్రీ నృపేంద్ర మిశ్రా చెప్పారు. శతాబ్ధాల పాటు ఈ నిర్మాణం నిలిచేలా సాంప్రదాయ భారతీయ నిర్మాణ శైలిని, సైన్స్‌ని జోడించి నిర్మించినట్లు తెలిపారు. ఈ నిర్మాణంలో భారతీయ సైంటిస్టులు, ఇస్రో టెక్నాలజీని కూడా వాడారు. నాగర్ శైలిలో చంద్రకాంత్ సోంపురా ఈ ఆలయ డిజైన్ రూపొందించారు. వాస్తు శాస్త్రాన్ని మిళితం చేసి రూపకల్పన చేశారు.
మొత్తం 2.7 ఎకరాల విస్తీర్ణంలో ఆలయాన్ని నిర్మించారు. దాదాపుగా 57,000 చదరపు అడుగుల్లో మూడు అంతస్తుల్లో నిర్మాణం జరిగింది. ఆలయం ఎత్తు 161 అడుగులు ఉంటుంది. ఇనుము, ఉక్కును ఆలయ నిర్మాణంలో వాడలేదు. ఇనుము జీవితకాలం కేవలం 80-90 ఏళ్లు ఉంటుందని అందుకే ఉపయోగించలేదని నృపేంద్ర మిశ్రా చెప్పారు. నాణ్యమైన గ్రానైట్, ఇసుక రాయి, పాలరాయి ఉపయోగించి, జాయింట్లలో సిమెంట్, సున్నపు మోర్టార్లను కూడా వాడకుండా.. లాక్ అండ్ కీ మెకానిజం వాడామని రూర్కీ లోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ ప్రదీప్ కుమార్ రామంచర్ల చెప్పారు. 2500 ఏళ్ల కాలానికి వచ్చే భూకంపాలను కూడా తట్టుకునేలా నిర్మాణం జరిగినట్లు వెల్లడించారు.
Read Also: Guntur Kaaram: తండ్రికి తగ్గ తనయ.. అనాధ పిల్లల కోసం సితార కీలక నిర్ణయం
ప్రాచీన కాలంలో ఆలయ ప్రాంతం సమీపంలో సరయు నది ప్రవహించిన ఆనవాళ్లు ఉన్నాయి. దీంతో ఆలయ నిర్మిత ప్రాంతం దిగువన ఇసుక అస్థిరంగా ఉన్నట్లు విశ్లేషణల్లో తెలిసింది. దీంతో ఆలయ ప్రాంతంలో మట్టిని 15 మీటర్ల లోతు వరకు తవ్వి, ఆ ప్రాంతంలో 12-14 మీటర్ల లోతు వరకు ఇంజనీరింగ్ మట్టిని వేశారు. స్టీల్ రీ బార్లు ఉపయోగించలేదు. 47 లేయర్ల బేస్ వరకు దృఢమైన రాతిలాగా ఉండేలా పునాదిని వేశారు. దీనిపై 1.5 మీటర్ల మందంతో M-35 గ్రేడ్ మెటల్ లేని కాంక్రీట్‌ని పటిష్టంగా వేశారు. దక్షిణ భారత దేశం నుంచి వచ్చిన గ్రానైట్ రాయిని 6.3 మీటర్ల మేర పరిచారు.
ఇక పునాదిపై సందర్శకులకు కనిపించే భాగాన్ని రాజస్థాన్ నుండి సేకరించిన ‘బన్సి పహర్‌పూర్’ అనే పింక్ ఇసుకరాయితో రూపొందించబడింది. CBRI ప్రకారం, గ్రౌండ్ ఫ్లోర్‌లో మొత్తం 160 కాలమ్స్, మొదటి అంతస్తు 132 మరియు రెండవ అంతస్తు 74 ఉన్నాయి. ఇవన్నీ ఇసుకరాయితో తయారు చేశారు. గర్భగుడిలో రాజస్థాన్ మక్రానా మార్బుల్ అమర్చారు. తాజ్ మహల్‌ని కూడా ఇదే రాయితో నిర్మించారు.
2500 ఏళ్లు రిటర్న్ పిరియడ్ భూకంపాలను తట్టుకునేలా.. ఇంటర్ లాక్ టెక్నాలజీతో 1000 ఏళ్లు ఈ రామ మందిరం నిలవబోతోంది. బెంగుళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్‌లో పనిచేస్తున్న హెరిటేజ్ లోహాల ప్రత్యేకత కలిగిన పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ శారదా శ్రీనివాసన్ మాట్లాడుతూ..పూర్వ కాలాల్లో ఆలయ నిర్మాణ సంప్రదాయ శైలి పొడి రాతితో తయారు చేయబడింది, ఇనుము, ఉక్కు ఉపయోగించలేదు, ఆ తరువాత 12వ శతాబ్ధం నుంచి ఇనుము ఉపయోగం కనిపిస్తుందని చెప్పారు.