No Divorce For Man Who Falsely Claimed Wife Is HIV Positive: భార్యకు హెచ్ఐవీ ఉందని అబద్ధం చెబుతూ విడాకులు కోరాడు ఓ వ్యక్తి. ఈ కేసును బాంబే హైకోర్టు విచారించింది. పూణేకు చెందిన 44 ఏళ్ల వ్యక్తి తన భార్యకు హెచ్ఐవీ ఉందని ఆరోపిస్తూ.. విడాకులు కోరాడు. అయితే ఇది అబద్ధం అని తెలిసి విడాకులకు నిరాకరించింది బాంబే హైకోర్టు. తన విడాకుల పిటిషన్ ను తిరస్కరిస్తూ ఈ ఏడాది పూణేలోని ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్వర్వులను సవాల్ చేస్తూ సదరు వ్యక్తి బాంబే హైకోర్టును ఆశ్రయించాడు.
2011లో పూణే ఫ్యామిలో కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో వేసిన అప్పీల్ ను న్యాయమూర్తులు నితిన్ జామ్‌దార్, షర్మిలా దేశ్‌ముఖ్‌లతో కూడిన డివిజన్ బెంచ్ కొట్టేస్తూ.. విడాకులు ఇవ్వడానికి తిరస్కరించింది. సదరు వ్యక్తి తన భార్యకు హెచ్ఐవీ సోకిందని సరైన ఆధారాలు సమర్పించలేకపోయాడని కోర్టు వెల్లడించింది. విడాకులు ఇవ్వాల్సిందిగా చేసిన ప్రార్థనలను కోర్టు పూర్తిగా తిరస్కరిస్తోందని హైకోర్టు పేర్కొంది.
Read Also: Jama Masjid: జామామసీద్‌లోకి మహిళల ప్రవేశంపై నిషేధం.. మహిళా కమిషన్ నోటీసులు
2003లో ఈ జంట వివాహం చేసుకుంది. తన భార్య విచిత్ర స్వభావం, మొండితనం గలదని.. తన కుటుంబ సభ్యులతో సరిగ్గా ప్రవర్తించడం లేదని సదరు వ్యక్తి ఆరోపించారు. ఆమెకు క్షయవ్యాధి ఉందని.. ఆ తరువాత హెర్పిస్ సోకిందని ఆ వ్యక్తి కోర్టులో వాదించాడు. ఈ క్రమంలోనే ఆమెకు హెచ్ఐవీ పాజిటివ్ గా తేలిందని.. తనకు విడాకులు కావాలని కోర్టును కోరాడు. అయితే అతడు చేస్తున్న వాదనలను భార్య ఖండించింది. తనకు హెచ్ఐవీ పరీక్షలో నెగిటివ్ వచ్చిందని.. అయినప్పటికీ తన భర్త కుటుంబ సభ్యులలో పుకార్లు వ్యాపించేలా చేశారని తెలిపింది.
అయితే విడాకులు కోరిన వ్యక్తి, తన భార్యకు హెచ్ఐవీ పాజిటివ్ ఉందని వైద్య నివేదికలు సమర్పించడంలో విఫలం అయ్యాడని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. భార్య, అతనికి మానసిక క్షోభ కలిగించిందని, క్రూరంగా ప్రవర్తించిందనే ఒక్క సాక్ష్యం కూడా లేదని కోర్టు తెలిపింది. ఆమెకు జరిగిన వైద్య పరీక్షల్లో కూడా హెచ్ఐవీ డీఎన్ఏ ఎక్కడా కనుగొనబడలేదని.. అయినా కూడా భర్త, భార్యతో సహజీవనం చేయడానికి నిరాకరించాడని.. బంధువులు, కుటుంబం, సమాజంలో ఆమె పరువు తీశాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో విడాకులు ఇవ్వడం కుదరదని కోర్టు పేర్కొంది.