Nitish Kumar: లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. ఎన్డీయే కూటమి మరోసారి గెలుపొందడంతో వరసగా మూడోసారి ప్రధాని నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. రేపు భారత ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇదిలా ఉంటే గతంలా కాకుండా ఈ సారి ఎన్డీయే మిత్రపక్షాల పరపతి పెరిగింది. 2014, 2019లో 543 ఎంపీ సీట్లలో బీజేపీ మెజారిటీ మార్క్(272) సీట్ల కన్నా ఎక్కువ సీట్లను స్వతహాగా కైవసం చేసుకుంది. అయితే, ఈ సారి మాత్రం 240 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. దీంతో మిత్రపక్షాలైన జేడీయూ, తెలుగుదేశం, శివసేన వంటి పార్టీలపై ఆధారపడాల్సి ఉంది.
Read Also: Congress: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘన విజయం తర్వాత, ‘ధన్యవాదయాత్ర’ని ప్రకటించిన కాంగ్రెస్..
ఈ నేపథ్యంలో మిత్రపక్షాలకు ప్రాధాన్యత ఉన్న కీలకమైన మంత్రి పదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది. నితీష్ కుమార్ జేడీయూ పార్టీకి రెండు కేబినెట్ బెర్తుల్ని కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పార్టీ నుంచి లాలన్ సింగ్, రామ్‌నాథ్ ఠాకూర్ ఇద్దరు సీనియర్ నేతల పేర్లను పార్టీ ప్రతిపాధించింది. లాలన్ సింగ్ బీహార్ ముంగేర్ నుంచి లోక్ సభకు ఎన్నిక కాగా, రామ్ నాథ్ ఠాకూర్ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. మిస్టర్ ఠాకూర్ భారతరత్న గ్రహీత కర్పూరి ఠాకూర్ కుమారుడు.
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం జేడీయూ 12 ఎంపీ స్థానాలను గెలుచుకున్న తర్వాత రెండు కేబినెట్ బెర్తుల్ని కోరింది. మరోవైపు చంద్రబాబు నాయుడుకి చెందిన టీడీపీ తమకు నాలుగు శాఖలు, పార్లమెంటరీ స్పీకర్ పదవి ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం 543 సీట్లు ఉన్న లోక్‌సభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 293 సభ్యులు ఉన్నారు.