Nitish Kumar: బీహార్ సీఎం నితీష్ కుమార్ అభిమానుల అత్యుత్సాహం అతనికి తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. నితీష్ కుమార్‌ని పొగుడుతూ ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మిత్రపక్షమైన ఆర్జేడీ కూడీ ఈ వివాదాలపై ఆచితూచి స్పందిస్తోంది. తాజాగా ఓ అభిమాని నితీష్ కమార్ ‘‘దేశానికి రెండో గాంధీ’’ అని పొగుడుతూ బ్యానర్‌ని ఏర్పాటు చేశారు.
నితీష్ కుమార్ సమానత్వ పాఠం నేర్పారని పోస్టర్ లో కొనియాడారు. సామాజిక సంస్కరణలు తీసుకురావడానికి బీహార్ సీఎం ఎంతో కృషి చేశారని, మహాత్మాగాంధీ అనుసరించిన బాటలోనే ఆయన నడుస్తున్నారని జేడీయూ నాయకులు తెలిపారు.
Read Also: Abhiram Daggubati: రానా నన్నెప్పుడు తమ్ముడిలా చూడలేదు.. నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు అన్న మాటలు..
నితీష్ కుమార్‌ని రెండో గాంధీగా అభినందించిన పోస్టర్లపై మిత్రపక్షమైన ఆర్జేడీ నాయకుడు శివానంద్ తివారీ స్పందించారు. ఈ పోస్టర్లను నితీష్ కుమార్ భక్తులు అంటించారని, అయితే మహాత్మాగాంధీని అవమానించవద్దని అన్నారు. గాంధీ లాంటి వారు వెయ్యి ఏళ్లకు ఒకసారి పుడతారని రామ్ మనోహర్ లోహియా వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ తివారీ అన్నారు. ప్రతిపక్ష బీజేపీ ఈ వ్యవహారంపై నితీష్ కుమార్, జేడీయూ పార్టీలపై విరుచుకుపడింది.
ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తర్వాత బీజేపీని వదిలేసి ఆర్జేడీతో జట్టుకట్టిన జేడీయూ పార్టీ బీహార్ లో అధికారంలో ఉంది. ప్రస్తుతం జేడీయూ ఇండియా కూటమిలో భాగస్వామి. తొలిసమావేశాన్ని బీహార్ లోని పాట్నాలోనే నిర్వహించారు. ఇటీవల పలు సందర్భాల్లో నితీష్ కుమార్ ప్రధాని అంటూ జేడీయూ కార్యకర్తలు, నేతలు బ్యానర్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కూడా మిత్ర పక్షాలు ఒకింత అసహనం వ్యక్తం చేశాయి.