Nitin Gadkari: కేంద్ర మంత్రి, బీజేపీ కీలక నేత నితిన్ గడ్కరీకి మరోసారి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఢిల్లీలోని మోతీలాల్ నెహ్రూ రోడ్డులో ఉన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధికార నివాసంలోని ల్యాండ్ లైన్ నంబర్ కు గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపు కాల్ చేసినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి గడ్కరీ కార్యాలయ సిబ్బందికి ఫోన్ వచ్చిందని, కాల్ చేసిన వ్యక్తి తన వివరాలను పంచుకోకుండా, మంత్రితో మాట్లాడాలని, అతనిని బెదిరించాలని చెప్పినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.
Read Also: Karnataka CM Post: సిద్ధరామయ్య వైపే మొగ్గు.. డీకే శివకుమార్‌ను దెబ్బతీసిన అంశాలు ఇవే..
గుర్తు తెలియని వ్యక్తి హిందీలో మాట్లాడుతూ.. ‘‘ముఝే మంత్రి జీ సే బాత్ కర్నీ హై, ఉన్ హే త్రెటెన్ కర్నా హై’’(నేను మంత్రితో మాట్లాడాలనుకుంటున్నాను మరియు అతన్ని బెదిరించాలనుకుంటున్నాను) అంటూ చెప్పి, వెంటనే కాల్ డిస్ కనెక్ట్ చేశాడని పోలీసులు తెలిపారు. మంత్రి కార్యాలయం ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
కాల్ రికార్డుల వివరాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. నిందితుడు ల్యాండ్ లైన్ నంబర్ కు కాల్ చేశాడు, కాబట్టి మేము అతడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, విచారణ జరుగుతోందని అధికారి తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో నాగ్ పూర్ లోని మంత్రి కార్యాలయానికి ఇలాగే రెండు సందర్భాల్లో బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీనిపై విచారణ జరిపేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బృందం మే 9న నాగ్‌పూర్‌కు వెళ్లింది. బెలగావి జైలులో హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న జయేష్ పూజారి అలియాస్ కాంత అనే దోషి ఈ కాల్ చేసినట్లు తేలింది. అతనిపై ఉగ్రవాద నిరోధక చట్టం యూఏపీఏ కింద కేసులు నమోదు చేశారు.