NIA, IT raids across the country: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), ఐటీ డిపార్ట్మెంట్లు మంగళవారం దాడులు నిర్వహిస్తున్నాయి. గ్యాంగ్ స్టర్- టెర్రర్ లింకులపై ఎన్ఐఏ విస్తృతంగా దాడులు చేస్తోంది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ మరియు మధ్యప్రదేశ్లోని 72 ప్రదేశాల్లో ఏకకాలంలో దాడులు చేస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో ఆయుధాల సరఫరాదారు ఇంటిపై ఎన్‌ఐఏ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో పాకిస్తాన్ నుంచి సరఫరా చేసిన వస్తువులను కనుక్కున్నారు. గ్యాంగ్ స్టర్లు లారెన్స్ బిష్ణోయ్-నీర్జ్ బవానా గ్యాంగులతో సంబంధం ఉన్న వ్యక్తులను విచారిస్తోంది.
Read Also: MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు బీఆర్ఎస్ మద్దతు.. సీఎం కేసీఆర్ నిర్ణయం
పాకిస్తాన్ ఐఎస్ఐ, గ్యాంగ్ స్టర్ లింకులపై ఆధారాలను సేకరిస్తోంది. ఇప్పటి వరకు కు నాలుగు సార్లు ఈ కేసులో ఎన్ఐఏ దాడులు నిర్వహించింది. చాలా మంది గ్యాంగ్ స్టర్లపై చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) (యూఏపీఏ)చట్టం కింద కేసులు నమోదు చేసింది. గత ఏడాది అక్టోబర్ నెలలో ఉగ్రవాదులు, గ్యాంగ్ స్టర్లు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా మధ్య ఉన్న సంబంధాలను లక్ష్యంగా చేసుకుని ఐదు రాష్ట్రాల్లో 50కి పైగా ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు నిర్వహించింది.
యూప్లెక్స్ లిమిటెడ్ లో ఐటీ శాఖ దాడులు చేస్తోంది. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ జమ్మూ కాశ్మీర్, హర్యానా, తమిళనాడు, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లోని 64 ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది. ఇదిలా ఉంటే స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, స్థానిక పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా నార్కో టెర్రరిజం కేసులో బారాముల్లా, అనంత్ నాగ్, పుల్వామా, బుద్గాం, సోపోర్ జిల్లాల్లో సోదాలు నిర్వహిస్తోంది.