Mumbai Rains: మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాయగడ్ జిల్లాలో ఇవాళ (ఆగస్టు 19న) ఉదయం నుంచి ఎడ తెరిపి లేకుండా ఆకాలంగా కురిసిన భారీ వర్షాల కారణంగా ముంపు ప్రాంతల్లో ఏడుగురు మృతి చెందినట్లు సమాచారం. ఇక, ముంబై, థానే, పూణె నగరాల్లో భారీ వర్షాలతో పలు రోడ్లు జలమయం అయ్యాయి. ఇక, లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో నివాసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Read Also: KCR-Harish Rao : కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌పై హైకోర్టుకు కేసీఆర్, హరీష్ రావు
సీఎం ఫడ్నవీస్ హెచ్చరిక..
మరోవైపు, రాష్ట్రంలో వరద పరిస్థితులపై విపత్తు నిర్వహణ శాఖతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమీక్ష సమావేశం జరిపారు. ఈ సందర్భంగా రాబోయే 48 గంటలు ముంబై, థానే, రాయగడ్, రత్నగిరి, సింధుదుర్గ జిల్లాలకు చెందిన ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను తరలించడం, వరద ముప్పు ఉన్న ప్రాంతాలను పర్యవేక్షించడంతో పాటు రక్షణ చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఇప్పటికే నాందేడ్ జిల్లాలో వరదలతో ప్రభావితమైన గ్రామాల నుంచి 290 మందికి పైగా ప్రజలను రక్షించామని అధికారులు సీఎంకు తెలిపారు. ఈ క్రమంలో SDRF, ఆర్మీ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.
Read Also: KunaRavikumar: నీ డిగ్రీలు నా దయ దాక్షిణ్యంతో వచ్చినవే..
డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు..
ఈ భారీ వర్షాలతో మహారాష్ట్రలో దాదాపు 10 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమి వరదల కారణంగా నీట మునిగింది అని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చెప్పుకొచ్చారు. గడ్‌చిరోలిలోని భామ్రాగడ్ తాలూకాలో పెర్లకోట నది ఉప్పొంగడంతో 50కి పైగా గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. కావునా, అనవసరంగా ప్రజలు బయటకు రాకూడదని విజ్ఞప్తి చేశారు.
వాతావరణ శాఖ హెచ్చరిక
బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన తుఫాన్ గాలుల ప్రభావంతోనే మహారాష్ట్రలో కుండపోత వర్షాలు కురిపిస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కొంకణ్ నుంచి కేరళ వరకు ఏర్పడిన అల్ప పీడనం ప్రభావంతో కొంకణ్, మధ్య మహారాష్ట్ర, ఘాట్ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు పడుతున్నాయి.. మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల్లో సైతం మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకొచ్చారు. కాగా, రాబోయే రెండు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ అంచనా వేసింది. అలాగే, మరాఠ్వాడ, విదర్భ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.