Ayodhya Mosque: అయోధ్యలో కొత్త మసీదు నిర్మాణానికి మార్గం సుగమం అయింది. మసీదు నిర్మాణానికి సంబంధించి తుది అనుమతులను అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ(ఏడీఏ) తుది క్లియరెన్స్ ఇచ్చింది. బాబ్రీ మసీదు-రామజన్మభూమి తీర్పులో సుప్రీంకోర్టు అయోధ్యలో ధన్నీపూర్ మసీదు నిర్మాణానికి ఆదేశాలు ఇచ్చింది. పెండింగ్ క్లియరెన్స్ ల కారణంగా గత రెండేళ్లుగా నిర్మాణం ఆలస్యం అయింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఐదు ఎకరాల స్థలంలో ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ (ఐఐసిఎఫ్) ట్రస్ట్ ద్వారా మసీదు, ఆసుపత్రి, పరిశోధనా సంస్థ, కమ్యూనిటీ కిచెన్, లైబ్రరీని నిర్మించనున్నారు.
Read Also: Shivraj Singh Chouhan: రాహుల్ గాంధీ నీ ఫోన్ లో పెగాసస్ లేదు.. నీ మైండ్‌లో ఉంది..
శుక్రవారం జరిగి ఏడీఏ బోర్డు మీటింగ్ లో అయోధ్య మసీదు ప్రాజెక్టను ఆమోదించారు. ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ కొన్ని శాఖల ఫార్మాలిటీస్ అందచేస్తామని, అవి రెండు రోజుల్లో పూర్తవుతాయని అయోధ్య డివిజనల్ కమిషనర్ గౌరవ్ దయాల్ వెల్లడించారు. అన్ని అనుమతులు వచ్చిన తర్వాత ట్రస్టు సమావేశం నిర్వహించి మసీదు నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికను ఖరారు చేస్తామని ఐఐసీఎఫ్ కార్యదర్శి అథర్ హుస్సేన్ తెలిపారు. ఏప్రిల్ 21న ముగిసే రంజాన్ తర్వాత ట్రస్టు సమావేశం జరుగుతుందని, ఆ సమావేశంలో మసీదు నిర్మాణ పనులు ప్రారంభించే తేదీని ఖరారు చేస్తామని ఆయన చెప్పారు.
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి ఏడు దశాబ్ధాలు అవుతున్న రోజున జనవరి 26, 2021న మసీదుకు శంకుస్థాపన చేశారు. ధన్నిపూర్ మసీదు, బాబ్రీ మసీదు కన్నా పెద్దగా ఉంటుందని హుస్సెన్ వెల్లడించారు రామ మందిరం నుంచి ధన్నీపూర్ మసీదు స్థలం సుమారు 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. నవంబర్ 9, 2019 న సుప్రీంకోర్టు అయోధ్య రామమందిరంపై చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. వివాదాస్పద స్థలాన్ని రామ మందిరాన్ని నిర్మించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది, అదే విధంగా మసీదు నిర్మాణానికి 5 ఎకరాల భూమిని కేటాయించాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుతం అయోధ్య రామమందిరం శరవేగంగా నిర్మితమవుతోంది. 2024 జనవరిలో భక్తుల కోసం గుడిని తెరుస్తామని దేవాలయ ట్రస్ట్ చెబుతోంది.