Iran-US Mediation: పాక్‌పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్‌నే నమ్ముతున్న రష్యా

  • అమెరికా-ఇరాన్ మధ్య మధ్యవర్తిగా భారత్..
  • బ్రిక్స్ సమావేశంలో రష్యా మంత్రి కీలక ప్రతిపాదన..
India Russia

India Russia

Iran-US Mediation: న్యూఢిల్లీ వేదికగా బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రులు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రష్య విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలలో భారతదేశం ఒక ‘‘ధీర్ఘకాలిక మధ్యవర్తి’’ పాత్ర పోషించగలదని రష్యా విదేశాంగ మంత్రి అన్నారు. ప్రస్తుతం, ఇరాన్ యుద్ధంలో పాకిస్తాన్ మధ్యవర్తి పాత్ర పోషిస్తోంది. అయితే, పాకిస్తాన్ చేసిన మధ్యవర్తిత్వం ఫలితాలను ఇవ్వలేదు. పాక్ అమెరికా ప్రతిపాదనల్ని తమ ముందు పెడుతోందని, తమ ప్రతిపాదనల్ని పట్టించుకోవడం లేదని ఇరాన్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా ప్రతిపాదన కీలకంగా మారింది.

‘‘సమస్యలను పరిష్కరించేందుకు అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు జరిపేందుకు పాకిస్తాన్ ప్రస్తుతం సహాయం చేయవచ్చు. అయితే దీర్ఘకాలిక మధ్యవర్తి అవసరమైతే సుదీర్ఘ దౌత్య అనుభవం ఉన్న భారత్ ఆ పాత్ర పోషించగలదు’’ అని రష్యా మంత్రి అన్నారు. అయితే, లావ్రోవ్ చేసిన ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్‌కు చికాకు తెప్పించవచ్చు. పాక్ మధ్యవర్తిత్వంపై ఇజ్రాయిల్, యూఏఈ, ఇరాన్ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇటీవల పాక్ మధ్యవర్తిత్వాన్ని తాము విశ్వసించడం లేదని అమెరికా సెనెటర్ లిండ్సే గ్రాహం అన్నారు.

అమెరికా, ఇజ్రాయిల్ దాడుల నుంచి ఇరాన్ తన సైనిక విమానాలను రక్షించుకోవడానికి పాక్ సహాయం చేసిందని, పాకిస్తాన్‌లోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌లో ఇరాన్ విమానాలు ఉంచడానికి అనుమతించిందని అమెరికన్ మీడియా పేర్కొంది. ఇదే సమయంలో భారత్‌కు అటు అమెరికా, ఇటు ఇరాన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతోనే రష్యా ఈ ప్రతిపాదన చేసి ఉంటుంది.