Lawrence Bishnoi: గత నెలలో ఎన్సీపీ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిక్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సిద్ధిక్ తన కుమారుడు జీషన్ సిద్ధిక్ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న క్రమంలో గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్స్ కాల్చి చంపారు. ఈ కేసులో మోస్ట్ వాంటెడ్ నిందితుల్లో ఒకరైన శుభమ్ లోంకర్ ఖచ్చితంగా బిష్ణోయ్ గ్యాంగ్ కోసం పనిచేస్తునట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఇదిలా ఉంటే, విచారణలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. రెండేళ్ల క్రితం ఢిల్లీలో జరిగి శ్రద్ధావాకర్ హత్య అందరికి తెలిసే ఉంటుంది. లివింగ్ రిలేషన్‌లో ఉన్న ఆమెని ప్రియుడు అఫ్తాబ్ పూనావాలా అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆమె శరీరాన్ని 32 ముక్కలుగా నరికి ఢిల్లీ శివార్లలో పారేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే, శ్రద్ధా హంతకుడు అఫ్తాబ్ పూనావాలా కూడా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ రాడార్‌లో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం అఫ్తాబ్ తీహార్ జైలులో ఉన్నాడు. ఈ సమాచారంతో మహారాష్ట్ర ఏటీఎస్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను అప్రమత్తం చేసింది.
Read Also: Jeff Bezos Marriage: అమెజాన్ వ్యవస్థాపకుడు రెండో పెళ్లి.. క్రిస్మస్ రోజున ప్రియురాలితో వివాహం
ఇదిలా ఉంటే, బాబా సిద్ధిక్ హత్యలో మోస్ట్ వాంటెడ్ శుభమ్ లోంకర్‌గా ఉన్నాడు. ఇప్పటి వరకు సిద్ధిక్ హత్య కేసులో 24 మంది అనుమానితుల్ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో మోస్ట్ వాంటెడ్ నిందితులు జీషన్ అక్తర్, శుభమ్ లోంకర్ ఇప్పటికీ పరారీలో ఉన్నారు. పూణేలో నివాసం ఉంటున్న లోంకర్‌ని ముంబై క్రైమ్ బ్రాంచ్ అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. సోర్సెస్ ప్రకారం.. ఈ ఏడాది జనవరిలో అకోలా పోలీసులు ఆయుధాల చట్టం కేసులో శుభమ్ లోంకర్‌ని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో పోలీసులు శుభం లోంకర్ నుంచి మూడు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. శుభమ్ లోంకర్‌కు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ మరియు అతని సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌లతో సంబంధాలు ఉన్నాయని మరియు అతను తుపాకుల అక్రమ రవాణాలో పాల్గొన్నాడని అకోలా పోలీసుల నివేదిక సూచిస్తుంది.