Sanjay Raut: ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఇటీవల తొక్కిసలాట జరిగింది. ఈ సంఘటనలో మొత్తం 30 మంది మరణించగా, 60 మంది గాయపడ్డారు. ఇప్పుడు దీనిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ప్రతిపక్షాలు మృతుల సంఖ్యని స్పష్టం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్, ఎస్పీ సహా ఇతర ప్రతిపక్షాలు యోగి సర్కార్‌పై ఆరోపణలు చేస్తున్నాయి.
Read Also: Chinese ship: అరేబియా సముద్రంలోకి చైనా నౌకలు.. భారత్‌కి అలర్ట్..
ఇదిలా ఉంటే, ఈ సంఘటనపై ఉద్ధవ్ ఠాక్రే శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. జనవరి 29న జరిగిన తొక్కిసలాటలో 2000 మంది మరణించారని మంగళవారం రాజ్యసభలో ఆరోపించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా తొక్కిసలాట మృతుల అధికారిక సంఖ్యను ఆయన ప్రశ్నించారు.
“4-5 రోజుల క్రితం తొక్కిసలాట జరిగినప్పుడు, అది తొక్కిసలాట కాదని, పుకారు అని చెప్పారు. 30 మంది మరణించారు. ఆ సంఖ్య నిజమేనా? మృతుల సంఖ్యని దాచవద్దు. ఒక్క వ్యక్తి మరణించినా మేము బాధ్యత తీసుకుంటాము, మేము మా కళ్ళతో చూసిన గణాంకాల ప్రకారం 2,000 మంది చనిపోయారు,” అని అతను అన్నారు. ఈ ఘటనకు నిర్వహణ లోపమే కారణమని, కుంభమేళాని రాజకీయ మార్కెటింగ్ కోసం ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ఇతర దేశాల్లో ఇలాంటి ఘటనలు జరిగేతే ప్రధానిని రాజీనామా చేయాలనే డిమాండ్లు వచ్చేవని అన్నారు.