Gurpatwant Singh Pannun: ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నాడనే అభియోగాలతో నిఖిల్ గుప్తా అనే భారతీయుడిని అమెరికా కోరిక మేరకు చెక్ రిపబ్లిక్ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడు చెక్ రిపబ్లిక్ జైలులో ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ కేసులో నిఖిల్ గుప్తా కుటుంబం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. భారత ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరింది.
చెక్ రిపబ్లిక్ లో నిఖిల్ గుప్తాను అక్రమంగా నిర్భందించారని, తనకు సాయం చేసేలా ఈ విషయంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టుని కోరారు. పిటినర్ భారతీయుడు కావడంతో అతని ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, రాజకీయ కుట్రలకు అతను బాధితుడయ్యాడని కుటుంబం సుప్రీంకి తెలిపింది. అయితే ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది సున్నితమైన అంశమని.. మరో దేశంలో జరిగే అరెస్టు తమ న్యాయశాఖ పరిధిలోకి రావని, అందువల్ల మీరు చెక్ రిపబ్లిక్ కోర్టు వెళ్లండి అంటూ సూచించింది. జనవరి 4న దీనిపై మరోసారి విచారించనుంది.
Read Also: Krishna Janmabhoomi: కృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా సర్వేపై స్టే ఇవ్వలేం.. స్పష్టం చేసిన సుప్రీంకోర్టు..
అమెరికన్ సిటిజన్ అయిన గురుపత్వంత్ సింగ్ పన్నూ అనే వ్యక్తి ఖలిస్తానీ ఉగ్రవాదిగా భారత్ గుర్తించింది. అయితే ఇతడిని అమెరికన్ గడ్డపై హతమార్చేందుకు నిఖిల్ గుప్తా అనే వ్యక్తి, ఓ కాంట్రాక్ట్ కిల్లర్‌కి డబ్బులిచ్చి ప్లాన్ చేశాడని అమెరికా న్యాయశాఖ అభియోగాలు మోపింది. ఈ కుట్రలో ఓ భారతీయ ప్రభుత్వ ఉద్యోగి ప్రమేయం కూడా ఉందని ఆరోపించింది. నిఖిల్ గుప్తా చెక్ రిపబ్లిక్ దేశంలో ఉండటంతో అతడిని అరెస్ట్ చేయాలని అమెరికా కోరగా.. అక్కడి అధికారులు నిర్భందించారు. అమెరికా అతడిని తమకు అప్పగించాలని చెక్ అధికారులను కోరుతోంది. ఈ కేసులో నిఖిల్ గుప్తా దోషిగా తేలితే 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.