PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల 15-17 వరకు కెనడాలోని అల్బెర్టాలో జరగబోయే గ్రూప్ ఆఫ్ సెవెన్ (G7) దేశాల శిఖరాగ్ర సమావేశానికి వెళ్లనున్నారు. ఇటీవల, కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్వయంగా ప్రధాని మోడీకి ఫోన్ చేసిన జీ-7 సమావేశానికి హాజరుకావాలని ఆహ్వానించారు, దీనికి మోడీ ఒప్పుకున్నారు. అయితే, కెనడాకు వెళ్తూ, మార్గం మధ్యలో సైప్రస్‌లో ప్రధాని మోడీ ఆగనున్నట్లు తెలుస్తోంది.
మధ్యదరా ప్రాంతంలోని దేశాలకు భారత్ చాలా ప్రాముఖ్యత ఇస్తోంది. సైప్రస్, గ్రీస్ వంటి దేశాలతో సంబంధాలు పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా, ఈ ప్రాంతంలో టర్కీతో సైప్రస్, గ్రీస్ దేశాలకు వైరం ఉంది. ఇదే సమయంలో టర్కీ మనకు వ్యతిరేకంగా పాకిస్తాన్‌కి సహకరిస్తోంది. దీంతో, భారత్ శత్రువుకు శత్రువు మిత్రుడు అనే ధోరణిని అవలంబిస్తోంది.
Read Also: National Security Advisory Council: “జాతీయ భద్రతా సలహా మండలి” సభ్యుడిగా జి. సతీష్ రెడ్డి..
ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ సైప్రస్‌లో కొద్ది సమయం ఆగవచ్చనే సమాచారం ప్రాముఖ్యతను సంతరించుకుంది. సైప్రస్‌లో ఇంధనం నింపుకునేందుకు ఉపయోగిస్తారని తెలుస్తోంది. ప్రధాని మోడీ తన స్వల్పకాలిక పర్యటనలో ఆ దేశ అగ్రనాయకత్వంతో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించవచ్చని సంబంధిత వర్గాలు చెప్పా్యి. ఈ ప్రాంతంలో టర్కీ దుందుడుకు వైఖరి, విస్తరణవాదంపై సైప్రస్, గ్రీస్ దేశాలు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డొగాన్‌ని విమర్శిస్తున్నాయి.
గ్రీస్ ప్రాదేశిక జలాల్లో చమురు, గ్యాస్ అన్వేషణ ప్రణాళికలు, సైప్రస్ మారిటైమ్ ఎకనామిక్ జోన్లలో డ్రిల్లింగ్ నిర్వహించడంపై టర్కీపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్, సైప్రస్, గ్రీస్‌తో తన బంధాన్ని బలోపేతం చేసుకుంటోంది. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన 10 ఏళ్లలో సైప్రస్‌తో సంబంధాలు బలపడ్డాయి. పలు సందర్భాల్లో టర్కీకి వ్యతిరేకంగా సైప్రస్‌కి భారత్ మద్దతు తెలిపింది.