G20 Summit: జీ20 సమ్మిట్ కి భారత్ సిద్ధం అయింది. ఇప్పటికే సమావేశం జరగబోతున్న ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. జీ20 దేశాధినేతలు, అధికారులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సమావేశానికి రష్యా అధినేత పుతిన్ రావడం లేదు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కూడా ఈ సమావేశానికి డుమ్మా కొట్టవచ్చని తెలుస్తోంది.
Read Also: Himachal Pradesh: భారీ వర్షాలతో 400 మంది మృతి.. రెవిన్యూ మంత్రి జగత్‌సింగ్ నేగి
మరోవైపు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమావేశానికి హాజరుకానున్నారు. సెప్టెంబర్ 9-10 తేదీల్లో జీ20 సమ్మిట్ జరగనుంది. అంతకు ఒక రోజు ముందే సెప్టెంబర్ 8న బైడెన్- ప్రధాని మోడీల మధ్య ద్వైపాక్షిచ సమావేశం జరగనున్నట్లు వైట్‌హౌజ్ వర్గాలు ప్రకటించాయి. ‘‘ గురువారం (సెప్టెంబర్ 7), జి 20 నేతల సదస్సులో పాల్గొనడానికి ప్రెసిడెంట్ బైడెన్ భారతదేశంలోని న్యూఢిల్లీకి వెళతారు. శుక్రవారం, ప్రెసిడెంట్ బైడెన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొంటారు” అని వైట్ హౌస్ ప్రకటన పేర్కొంది.
జీ20 గ్రూప్ ప్రపంచంలో అభివృద్ధి చెందిన, చెందున్న దేశాల సమూహం. ఈ ఏడాది జీ20 సమావేశాలకు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. జీ20లో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కియే, యూకే, యూఎస్ఏ, యూరోపియన్ యూనియన్(ఈయూ) సభ్యులుగా ఉన్నాయి. ఆహ్వానిత దేశాలుగా బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, నెదర్లాండ్స్, నైజీరియా, ఒమన్, సింగపూర్, స్పెయిన్, యూఏఈ ఉన్నాయి.