MIM Party: జాతీయ రాజకీయ పార్టీ రేంజ్‌లో దేశవ్యాప్తంగా విస్తరించాలని ఆశిస్తున్న హైదరాబాద్ లోకల్ పొలిటికల్ పార్టీ ఎంఐఎం.. మధ్యప్రదేశ్‌లో తన ప్రయాణాన్ని మస్తుగా షురూ జేసింది. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. బీజేపీ పాలనలో ఉన్న ఆ రాష్ట్రంలో ఎంఐఎం లేటెస్టుగా లోకల్ బాడీ ఎలక్షన్‌లో అకౌంట్ ఓపెన్ చేసింది. జబల్‌పూర్, బుర్హాన్‌పూర్, ఖంద్వా పట్టణాల్లో నాలుగు వార్డులను కైవసం చేసుకుంది. జబల్‌పూర్ మునిసిపాలిటీలో ఇద్దరు, మిగతా రెండు చోట్ల ఒక్కరు చొప్పున ఎంఐఎం పార్టీ క్యాండేట్లు కార్పొరేటర్లుగా విజయం సాధించారు.
ఈ నాలుగు స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థుల పైనే నెగ్గారు. భోపాల్, ఇండోర్, ఖర్గాన్, రత్లామ్ సిటీల్లోనూ ఎంఐఎం బరిలో నిలిచింది. మొత్తం ఏడు పట్టణాల్లో పోటీ చేయగా మూడు చోట్ల సక్సెస్‌ను సొంతం చేసుకుంది. మధ్యప్రదేశ్‌లో ముస్లిం జనాభా దాదాపు 48 లక్షలు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఎంఐఎంకి పట్టు పెంచేందుకు పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నడుం బిగించబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని ఇప్పటికే ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంఐఎంకి ఓటేసిన ప్రజలకు ఆయన థ్యాంక్స్ చెప్పారు.
read more:
Inspirational News: కొడుకును ఆదర్శంగా తీసుకున్న తండ్రి. డాక్టర్ అయ్యేందుకు 55 ఏళ్ల వయసులో ‘నీట్’కి హాజరు
‘మధ్యప్రదేశ్‌లో మా రాజకీయ ప్రయాణ శుభారంభానికి ఈ విజయాలే నిదర్శనం. ప్రజల మద్దతుతో మరింత ఎదుగుతాం. ముఖ్యంగా మహిళలు, యువకులు మాకు సపోర్ట్ చేస్తారు’ అని అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన పురపాలక ఎన్నికల్లో ఈయన ఖంద్వా, భోపాల్, జబల్‌పూర్, బుర్హాన్‌పూర్‌లలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. వచ్చే ఏడాది జరిగే శాసనసభ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ అభ్యర్థులను పోటీకి దించనున్నామని అప్పుడే వెల్లడించారు. అసదుద్దీన్ చేసిన ఎన్నికల ప్రచారం బాగా పనిచేసినట్లు కనిపిస్తోంది.
ఎందుకంటే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై ఎంఐఎం క్యాండేట్లు చెప్పుకోదగ్గ మెజారిటీనే సాధించారు. జబల్‌పూర్‌లోని 49వ వార్డులో హస్తం పార్టీ అభ్యర్థి కన్నా ఎంఐఎం పార్టీ క్యాండేట్‌కి 1500లకు పైగా ఓట్లు రావటం గమనార్హం. మరోచోట అతి స్వల్ప మెజారిటీ(156 ఓట్ల)తో విక్టరీ కొట్టారు. అంచనాలు లేకుండా బరిలోకి దిగి అనూహ్యంగా గెలవటం ఎంఐఎంకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. ఇదే స్ఫూర్తితో అసెంబ్లీ ఎన్నికల్లోనూ క్యాండేట్లను దించితే ముస్లిం ఓట్లను భారీగా చీల్చే ఛాన్స్ ఉంది. తాజా ఫలితాలను బట్టి చూస్తే ఎంఐఎం ప్రభావం కాంగ్రెస్ పార్టీ పైనే ఎక్కువగా పడే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ప్రస్తుత ప్రదర్శనతో ఎంఐఎం యమ హ్యాపీగా ఉంది.