Mehbooba Mufti backs Israeli filmmaker’s remarks on The Kashmir Files: దేశంలో ‘ కాశ్మీర్ ఫైల్స్’ సినిమా మరోసారి వివాదాలకు కేంద్ర బిందువు అయింది. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమం ఈ వివాదానికి వేదిక అయింది. ఈ కార్యక్రమంలో జ్యూరీ హెడ్ ఇజ్రాయిలీ చిత్ర నిర్మాత నాదవ్ లాపిడ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. కాశ్మీర్ ఫైల్స్ సినిమాను ‘ వల్గర్’ సినిమా అని విమర్శించడంతో ఒక్కసారిగా వివాదం చెలరేగింది. దీనిపై నాదవ్ లాపిడ్ చేసిన వ్యాఖ్యలను ఇజ్రాయిలీ దౌత్యవేత్తలు ఖండించారు. వెంటనే భారత్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Also: Big News : ఢిల్లీ లిక్కర్ స్కాం రిమాండ్ రిపోర్ట్‌లో ఎమ్మెల్సీ కవిత పేరు
ఇదిలా ఉంటే కొంతమంది రాజకీయ నాయకులు, బాలీవుడ్ ప్రముఖులు నాదవ్ లాపిడ్ కు మద్దతుగా నిలుస్తున్నారు. బాలీవుడ్ నటి స్వరాభాస్కర్ వంటి వారు నాదవ్ లాపిడ్ కు మద్దతు ప్రకటించారు. అయితే తాజాగా కాశ్మీర్ నేత, పీపుల్ డెమెక్రాటిక్ పార్టీ( పీడీపీ) చీఫ్ మెహబూబా ముఫ్తీ కూడా నాదవ్ లాపిడ్ కు మద్దతుగా నిలిచారు. సత్యాన్ని నిశ్శబ్ధం చేయడానికి ఇప్పుడు దౌత్యమార్గాలను ఉపయోగిస్తున్నారని దుయ్యబట్టారు. ముస్లింలను, ముఖ్యంగా కాశ్మీరీలను దెయ్యాలుగా చిత్రీకరించడానికి, పండిట్‌లు, ముస్లింల మధ్య అగాధాన్ని పెంచడానికి అధికార పార్టీ(బీజేపీ) ప్రచారం చేసిన సినిమా తప్ప మరోటి కాదని కాశ్మీర్ ఫైల్స్ సినిమాను ట్విట్టర్ ద్వారా విమర్శించింది.
కాశ్మీర్ ఫైల్స్ చిత్రదర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఈ వివాదంపై స్పందించారు. ఇది నాకు కొత్తేమి కాదని.. ఎందుకంటే ఉగ్రవాదసంస్థలు, అర్బన్ నక్సలైట్స్, తుక్డే తుక్డే గ్యాంగ్ కి మద్దతు ఇచ్చేవారు ఈ రకమైన పదాలను ఉపయోగించారు.. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే భారత ప్రభుత్వం నిర్వహించిన ఓ వేదికపై కాశ్మీర్ ను భారత్ నుంచి విడగొట్టాలనుకునే ఉగ్రవాదుల కథనానికి మద్దతు లభించిందని నాదవ్ లాపిడ్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు.