Jagjit Singh Dallewal: రైతు నాయకుడు జగ్లీత్ దల్లెవాల్ నిరాహార దీక్ష విరమించాలని పంజాబ్ బీజేపీ అకల్ తఖ్త్‌కి విజ్ఞప్తి చేసింది. పంటలకు చట్టబద్ధమైన ఎంఎంస్‌పీ హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేపట్టారు. ఆయన ఆమరణ నిరాహార దీక్ష 46వ రోజుకు చేరుకుంది. అయితే, తాను నిరాహార దీక్ష విరమించాలనుకుంటే బీజేపీ నేతలు అకల్ తఖ్త్‌ని కాకుండా, ప్రధాని నరేంద్ర మోడీని కలవాలని శుక్రవారం కోరారు.
శుక్రవారం విడుదల చేసిన మూడు నిమిషాల వీడియో సందేశంలో, 70 ఏళ్ల రైతుల నాయకుడు దల్లెవాల్ మాట్లాడుతూ.. పంటలకు కనీస మద్దతు ధర కోసం చట్టపరమైన హామీతో సహా రైతుల డిమాండ్లను కేంద్రం అంగీకరించిన తర్వాతే తాను నిరాహార దీక్ష విరమిస్తానని స్పష్టం చేశారు. దల్లేవాల్ నిరవధిక నిరాహార దీక్షను ముగించడానికి జోక్యం చేసుకోవాలని సుఖ్‌మిందర్ పాల్ సింగ్ గ్రేవాల్, సర్‌చంద్ సింగ్‌లతో కూడిన బీజేపీ ప్రతినిధి బృందం గురువారం అకల్ తఖ్త్ జతేదార్ గియాని రఘ్‌బీర్ సింగ్‌కి విజ్ఞప్తి చేసింది.
Read Also: HimKavach: హిమాలయల్లో మన సైనికులకు రక్షణగా ‘‘హిమకవచ్’’.. డీఆర్డీఓ డెవలప్ చేసిన కొత్త దుస్తులు..
దల్లెవాల్ తన వీడియో సందేశంలో.. ‘‘ నా ఆమరణ నిరాహార దీక్షను ముగించడానికి జోక్యం చేసుకోవాలని పంజాబ్ బీజేపీ యూనిట్ నాయకులు అకల్ తఖ్త్‌కు విజ్ఞప్తి చేసినట్లు మాకు సమాచారం అందింది. నేను అకాల్ తఖ్త్‌ని గౌరవిస్తాను. కానీ పంజాబ్ బీజేపీ ప్రధాని నరేంద్రమోడీని, ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధంఖర్, వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, హోం మంత్రి అమిత్ షా లను సంప్రదించాలి. వీరిని కలవడానికి బదులుగా బీజేపీ నాయకులు అకల్ తఖ్త్ జతేదార్‌ని కలుస్తున్నారు’’ అని అన్నారు.
రైతు నాయకులు శుక్రవారం పంజాబ్-హర్యానా సరిహద్దుల్లో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మల్ని దహనం చేశారు. సంయుక్తి కిసాన్ మోర్చా( నాన్ పొలిటికల్) కన్వీనర్ దల్లెవాల్, గతేడాది నవంబర్ 26 నుంచి పంజాబ్, హర్యానా మధ్య ఉన్న ఖనౌరి చెక్ పాయింట్ వద్ద పంటల మద్దతు ధర కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. వైద్య సాయం తీసుకోవడానికి కూడా ఆయన నిరాకరిస్తున్నారు. దీంతో అతడి ఆరోగ్యం క్షీణించింది. ఢిల్లీకి ర్యాలీగా వస్తున్న క్రమంలో రైతుల్ని భద్రతా బలగాలు సరిహద్దుల్లో అడ్డుకున్నాయి. అప్పటి నుంచి అక్కడే మకాం వేసిన రైతులు నిరసన తెలుపుతున్నారు.