యూపీలోని అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. పిల్లలను దత్తత తీసుకోవాలంటే మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956 ప్రకారం సింగిల్ పేరెంట్ కూడా పిల్లలను దత్తత తీసుకోవచ్చని తెలిపింది. యూపీలోని వారణాసికి చెందిన ట్రాన్స్‌జెండర్ 2000 డిసెంబర్ 16న ఓ యువకుడిని పెళ్లి చేసుకుంది. ఈ జంట తాజాగా ఓ బిడ్డను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంది. దీంతో సంబంధిత అధికారులను సంప్రదించగా.. వాళ్లు వివాహ ధ్రువీకరణ పత్రం చూపించాలని అడిగారు.
ఈ నేపథ్యంలో వారణాసి జిల్లా సబ్ రిజిస్ట్రార్‌కు మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం సదరు జంట ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంది. అయితే ఇది పెండింగ్‌లో ఉండటంతో ట్రాన్స్‌జెండర్ దంపతులు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. పిల్లలను దత్తత తీసుకోవడానికి మ్యారేజ్ సర్టిఫికెట్ చూపించాల్సిన అవసరం లేదని తీర్పు వెల్లడించింది. దీంతో సదరు జంట బిడ్డను దత్తత తీసుకోవడానికి మార్గం సులువైంది.