Mandya MP Sumalatha extends ‘full support’ to BJP: ప్రముఖ సినీనటి, ఎంపీ సుమలత అంబరీష్ బీజేపీ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గత లోక్ సభ ఎన్నికల్లో ఆమె మాండ్యా లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. ఈ నెల 12న ప్రధాని నరేంద్రమోదీ కర్ణాకటక పర్యటనకు వెళ్లనున్నారు. మైసూరు-బెంగళూర్ 10 వరసల ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించేందుకు మాండ్యా వెళ్లనున్నారు. ఆయన పర్యటనకు ముందు సుమలత కీలక ప్రకటన చేశారు. భారతదేశంలో జరుగుతున్న అభివృద్ధి, ప్రపంచవ్యాప్తంగా భారత ఖ్యాతిని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. ఓ సగటు భారతీయుడు తల ఎత్తుకునేలా మోదీ పరిపాలన సాగిస్తోన్నారని అన్నారు.
Read Also: Kiran Abbavaram: హీరోయిన్ తో ప్రేమాయణం.. కిరణ్ అన్నా అడ్డంగా దొరికిపోయావ్
తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం బీజేపీకే మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. తాను కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకం అని తన కుమారుడు అభిషేక్ ఎప్పటికీ రాజకీయాల్లోకి రారని ఆమె చెప్పారు. నా మద్దతుదారులు, శ్రేయోభిలాషులను సంప్రదించిన తర్వాత ఈ నిర్ణయం ప్రకటించినట్లు వెల్లడించారు. స్వతంత్ర ఎంపీగా నాలుగేళ్లు అనేక సవాళ్లను ఎదుర్కొన్నట్లు ఆమె తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంపై తనకు పూర్తిగా నమ్మకం ఉందని ఆమె వెల్లడించారు. మోదీ ప్రపంచవ్యాప్తంగా ఆరాధించే వ్యక్తి అని కొనియాడారు.
మైసూర్-బెంగళూర్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం, ప్రధాని మాండ్యాకు రావడం గొప్ప గౌరవం అని అన్నారు. ఇది జిల్లా ప్రాముఖ్యతను తెలియజేస్తోందని అన్నారు. మాండ్యాను కంచుకోటగా మార్చుకున్న జేడీఎస్ జిల్లాకు చేసిందేం లేదని దుయ్యబట్టారు. మాండ్యాలో మార్పు రావాలన్నారు. అంతకుముందు మాండ్యా నియోజకవర్గం దివంగత స్టార్ హీరో అంబరీష్ స్వస్థలం. ఆయన మరణం తర్వాత ఈ స్థానం నుంచి సుమలత పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కన్నడ ఇండస్ట్రీతో పాటు బీజేపీ కూడా సుమలతకు మద్దతు తెలిపాయి. మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడపై సుమలత విజయం సాధించారు.