Sharad Pawar: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ ను చంపేస్తామంటూ ఇటీవల సోషల్ మీడియాలో బెదిరింపులు వచ్చాయి. శుక్రవారం తన తండ్రి శరద్ పవార్ వాట్సాప్ లో బెదిరింపు సందేశాలు వచ్చినట్లు కుమార్తె సుప్రియా సూలే చెప్పారు. శరద్ పవార్ భద్రత బాధ్యత హోం శాఖపై ఉందని, అమిత్ షా జోక్యం చేసుకోవాలని ఆమె కోరారు. మహారాష్ట్ర హోంమంత్రి, కేంద్ర హోంమంత్రి ఈ విషయంలో కలుగజేసుకోవాలని ఆమె కోరారు. ఇలాంటి దిగజారుడు రాజకీయాలను ఆపేయాలంటూ విమర్శించారు.
అయితే ఈ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి బీజేపీ కార్యకర్త అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎన్సీపీ కీలక నేత, శరద్ పవార్ సోదరుడి కొడుకైన అజిత్ పవార్ కూడా.. ఈ బెదిరింపులకు పాల్పడింది బీజేపీ కార్యకర్త సౌరభ్ పింపాల్కర్ అని ఆరోపించారు. నరేంద్ర దభోల్కర్ కు పట్టిన గతే శరద్ పవార్ కు పడుతుందని పింపాల్కర్ సోషల్ మీడియాలో బెదిరించారని.. అతని సోషల్ మీడియా ఖాతా బయోడెటాలో సౌరభ్ పింపాల్కర్ తనను తాను బీజేపీ కార్యకర్తగా పేర్కొన్నాడని, వెంటనే పోలీసులు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి బాధ్యతరహిత ప్రవర్తన తీవ్రంగా ఖండిస్తున్నట్లు అజిత్ పవార్ అన్నారు.
Read Also: Lord Hanuman: “హనుమంతుడు ఆదివాసీ”.. కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు..
మూఢవిశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాడిన నరేంద్ర దభోల్కర్ అనే వ్యక్తనిన ఆగస్టు 20, 2013లో పూణేలో మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో ఇద్దరు దుండగులు కాల్చి చంపారు. ఈ బెదిరింపులపై శరద్ పవార్ శుక్రవారం స్పందించారు. బెదిరింపుల ద్వారా ఒకరి గొంతును నొక్కేయడం చేయొచ్చని అనుకుంటే పొరపాటని ఆయన అన్నారు. మహారాష్ట్ర పోలీసులపై తనకు పూర్తి విశ్వాసం ఉందని అన్నారు. దేశంలో ప్రతీ పౌరుడికి తన అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్ఛ ఉందని ఆయన అన్నారు.
ఈ బెదిరింపులను షిండే-బీజేపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. శరద్ పవార్ భద్రతకు సీఎం ఏక్ నాథ్ షిండే హామీ ఇచ్చారు. పూణేలోని శివాజీ నగర్ ప్రాంతంలోని శరద్ పవార్ ఇంటి వద్ద భద్రతను పెంచారు. కాగా ఈ విషయం రాజకీయపరంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన తర్వాత.. నిందితుడు పింపాల్కర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అతని ఫోన్ కూడా స్విచ్ఛాప్ లో ఉంది. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. అమరావతి లా యూనివర్సిటీ పేపర్ లీక్ కేసులో సౌరభ్ సహ నిందితుడిగా ఉన్నాడు.