మహారాష్ట్రలో దారుణంగా జరిగింది. ఒక రిటైర్డ్ స్కూల్ ప్రిన్సిపాల్ మురళీధర్ రామచంద్ర జోషి(80) తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న భార్య లత (76)ను చంపి.. అనంతరం జోషి ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్యకు ఉపశమనం లభించిందంటూ ఒక సూసైడ్ నోట్‌ను రాసి పెట్టాడు. ఈ విషాద సంఘటన గురువారం జరిగిందని పోలీసులు తెలిపారు.
మహారాష్ట్రలోని నాసిక్‌లో జోషి(80), భార్య లత (76) నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. ముంబైలో స్థిరపడ్డారు. ఇక వృద్ధులను చూసుకోవడానికి కేర్ టేకర్ సీమా రాథోడ్ ఉంది. అయితే బుధవారం ఉదయం, మధ్యాహ్నం పని ముగించుకుని సీమా రాథోడ్ వెళ్లిపోయింది. తిరిగి సాయంత్రం 7 గంటలకు వచ్చింది. వచ్చి చూసేటప్పటికీ ఇద్దరు చనిపోవడం చూసి షాక్ అయింది. సమాచారాన్ని పోలీసులకు తెలియజేసింది.
ఇది కూడా చదవండి: Nagar Kurnool: నేటి నుంచి సలేశ్వరం జాతర ప్రారంభం..
మృతదేహాలను పరిశీలించిన పోలీస్ అధికారులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న భార్యకు విముక్తి కలిగించి.. తాను కూడా విముక్తి పొందుతున్నట్లు లేఖలో జోషి పేర్కొన్నాడు. ‘‘నా భార్య లతను నేను చాలా ప్రేమిస్తున్నాను. ఆమె అనారోగ్యంతో విసిగిపోయి మంచం పట్టింది. నేను ఆమెను అనారోగ్యం నుంచి విడిపించాలనుకుంటున్నాను. నన్ను కూడా విడిపించుకుంటున్నాను.’’ అని నోట్‌లో ఉంది. అంతేకాకుండా గత నాలుగేళ్లుగా కేర్ టేకర్ రాథోడ్ ఎంతో సహాయం చేసిందని.. ఆమె సేవను ప్రశంసిస్తూ రూ.50 వేలు అందజేయాలని రాసి పెట్టి ఉంది. అలాగే భార్య లతకు అంత్యక్రియలు నిర్వహించేటప్పుడు కొత్త చీర, మంగళసూత్రం, ఇతర ఆభరణాలతో అలంకరించాలని నోట్‌లో జోషి పేర్కొన్నారు. అంతేకాకుండా అంత్యక్రియలకు అవసరమైన డబ్బును కూడా ఉంచినట్లు తెలిపాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అప్నగర్ పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు.
ఇది కూడా చదవండి: Vontimitta Kalyanam 2025: ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణోత్సవం.. కడప మీదుగా వెళ్లే వాహనాలు దారి మళ్లింపు!