Rashmika Mandanna deepfake: నటి రష్మికా మందన్నా డీప్‌ఫేక్ వీడియో గతేడాది సంచలనంగా మారింది. బ్రిటిష్ ఇన్‌ఫ్లూయెన్సర్ జరా పటేల్ వీడియోకి రష్మికా ముఖాన్ని మార్ఫింగ్ చేసి రూపొందించిన ఈ వీడియోపై ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. టెక్నాలజీ దుర్వినియోగంపై కేంద్రం మరింత కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఈ వీడియో మార్ఫింగ్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. తాజాగా ఈ కేసులో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: Simultaneous Polls: ప్రతీ 15 ఏళ్లకు రూ. 10,000 కోట్లు.. “వన్ నేషన్-వన్ ఎలక్షన్”పై ఈసీ అంచనా..
డీప్‌ఫేక్ వీడియో వెనక ప్రధాన సూత్రధారి ఈమని నవీన్‌ని శనివారం అరెస్ట్ చేశారు. ఇతడు ఇంజనీర్, తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లను పెంచుకునేందుకే రష్మికా మందన్నా డీప్‌ఫేక్ వీడియోను క్రియేట్ చేశాడని తేలింది. పోలీసు వర్గాల ప్రకారం, నిందితుడు ఈమని నవీన్ గుంటూరులోని పెదనందిపాడు గ్రామానికి చెందిన వ్యక్తి. రష్మికా మందన్నా ఫ్యాన్ పేజీల్లో ఒకదాని ఫాలోవర్లను పెంచడానికి ఈ డీప్‌ఫేక్ వీడియోను చేశాడు. ఇతను రష్మికా అభిమాని. రష్మిక మందన్న ఫ్యాన్ పేజీ ఫాలోవర్లను పెంచడానికి, అతను అక్టోబర్ 13, 2023న డీప్‌ఫేక్ వీడియోను క్రియేట్ చేసి పోస్ట్ చేశాడు. ఈ ప్లాన్‌తో రెండు వారాల్లోనే అభిమానుల ఫాలోయింగ్ 90,000 నుండి 1,08,000కి విజయవంతంగా పెరిగింది.
నవీన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో బీటెక్ కలిగి ఉన్నాడు మరియు 2019లో ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన గూగుల్ గ్యారేజ్ నుండి డిజిటల్ మార్కెటింగ్‌లో సర్టిఫికేషన్ పొందాడు. ఇతనిపై ఐపీసీలోని 465 మరియు 469 సెక్షన్ల కింద ఫోర్జరీ మరియు ఒక వ్యక్తి ప్రతిష్టకు భంగం కలిగించినందుకు కేసు నమోదు చేశారు. అదనంగా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000లోని సెక్షన్ 66C (ఐడెంటిటీ థెఫ్ట్) మరియు సెక్షన్ 66E (గోప్యతా ఉల్లంఘన) కింద కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఇతడిని విచారణ నిమిత్తం పోలీసులు ఢిల్లీకి తీసుకెళ్లారు.